శ్రీవారి సేవలో నేపాల్ గూర్ఖాలు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:46 PM
తిరుమల చరిత్రలో కాలానుగుణంగా పాలనా వ్యవస్థలు మారినా, భక్తులకు సేవలు అందించే క్రమంలో విదేశీయుల పాత్ర కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది.
తిరుమల చరిత్రలో కాలానుగుణంగా పాలనా వ్యవస్థలు మారినా, భక్తులకు సేవలు అందించే క్రమంలో విదేశీయుల పాత్ర కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. బ్రిటిష్ తెల్లదొరలతోనే శ్రీవారి సేవకులు అంతమైపోలేదు. నేటికీ కొందరు విదేశీయులు స్వామి, భక్తుల సేవల్లో తరిస్తున్నారు. వారిలో నేపాల్‌కు చెందిన గూర్ఖాలు దశాబ్దాలుగా తిరుమలలో భద్రతా విధులు నిర్వహిస్తూ ఈ సేవా సంప్రదాయంలో భాగమయ్యారు. మరోదేశానికి చెందినవారైనప్పటికీ ఏడుకొండలపై విధులు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు.
కాలినడక భక్తులు తిరుమలకు చేరుకునేం దుకు ప్రధానం రెండు మార్గాలున్నాయి. అందులో ఒకటి ఎక్కువగా భక్తులు వినియోగించే అలిపిరి. మరొకటి శ్రీవారిమెట్టు. ఈ రెండు మార్గాలు కూడా దట్టమైన అడవిలోనే ఉంటాయి. 2006 ముందు వరకు టీటీడీ పరిధిలోని సెక్యూరిటీ సిబ్బందే కాలి నడక భక్తుల రక్షకులుగా ఉండేవారు. అయితే భక్తులకు రాత్రివేళ్లల్లో పూర్తిస్థాయిలో భద్రత కల్పించలేకపోవడం, అడవి కావడంతో కొంత భయానికి గురికావడం, ఎక్కువసేపు నడవలేక ఒకే ప్రాంతంలో నిలబడిపోవడం వంటివాటిని చేసిన భద్రతాధికారులు కాలి నడక భక్తులకు పటిష్టభద్రత కల్పించడం ఎలా అనే సందేహంలో పడ్డారు.
అప్పుడే ప్రస్తుతం టీటీడీ అదనపు సీవీఎస్వోగా పనిచేస్తున్న శివకుమార్ రెడ్డి, అప్పటి ఈవో రమణాచారి ద్వారా నేపాల్, వెస్ట్‌బెంగాల్‌లోని డార్జిలిన్ ప్రాంతాలకు చెందిన గూర్ఖాలను కాలినడక భక్తులకు రక్షణగా పెట్టాలనే ఆలోచన కలిగింది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా కొండకోనల్లో సులువుగా అటూఇటూ తిరుగుతూ గస్తీ కాయడంతో వారు నిష్ణాతులు కావడంతో... వారిని తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2006 తొలత ‘గూర్ఖా అరెజ్మెంట్’ నుంచి పదవీ విరమణ చేసిన 72 మందిని విధుల్లోకి తీసుకున్నారు.
కుటుంబాలతో సహా కొండపై నివాసం
ఉద్యోగం కోసం సొంత ఊరిని విడిచి మరో ప్రాంతానికి వెళ్లడమే చాలామందికి కష్టమైన విషయం. అలాంటిది మరో దేశానికి వెళ్లి, అక్కడే కుటుంబంతో సహా నివాసం ఏర్పాటు చేసుకోవడం అంత సులభం కాదు. కానీ నేపాలీ గూర్ఖాలు మాత్రం మూడు దశాబ్దాలకు పైగా తిరుమలలోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం 68 మంది గూర్ఖాల్లో సగానికిపైగా తమ భార్యాపిల్లలతో కలిసి తిరు మల కాలినడక మార్గాలోనే నివసిస్తున్నారు. స్వదేశానికి దూరంగా ఉన్నప్పటికీ, ఇక్కడి వాతావరణానికి అలవాటుపడి, శ్రీవారిక్షేత్రంలో భద్రతా బాధ్యతలను కొనసాగిస్తున్నారు. 2011 నుంచి ‘శ్రీశేషాద్రి హిందూ గూర్ఖా భద్రతా సేవ సంఘం’ అనే సొసైటీని ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు కార్పోరేషన్ ద్వారా పనిచేస్తున్నారు.
అడవిలో భక్తులకు అండగా...
తిరుమల కొండల చుట్టూ విస్తరించిన అటవీ ప్రాంతాలు, అక్కడి మార్గాల్లో భక్తుల రాకపోకలు నిరంతరం కొనసాగు తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో భక్తులకు భద్రత కల్పించడం కీలకమైన బాధ్యత. పైగా చిరుతలు, ఎలుగు బంట్ల భయం. ఇలాంటి పరిస్థితుల్లో గూర్ఖాలు రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ భక్తులకు అండగా నిలుస్తున్నారు. అడవిలోని మార్గాల్లో భద్రతను పర్యవేక్షించడం, భక్తులకు అవసర మైన సమయంలో తోడ్పాటు నందించడం వంటి బాధ్యతలు వీరి విధుల్లో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతల దాడుల అనంతరం సాయంత్రం 6 నుంచి అర్థరాత్రి వరకు భక్తులను బృందాలుగా చేసి వెనుక కొందరు, ముందు కొందరు భద్రత కల్పిస్తూ భక్తులను కొండెక్కిచడం వీరి కర్తవ్యం.
ఎండ, వాన, చలి వంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ జీతం రూ.20 వేలలోపే ఉన్నప్పటికీ భక్తుల సేవలతో తరిస్తున్నారు. అలిపిరి మార్గంలో మొదటి మెట్టు, గాలి గోపురం, ఏడోమైలు, కొత్తమండపం, అక్కగార్ల ఆలయం, మోకాళ్ల మెట్టును కేంద్రాలుగా మార్చుకునినిరంతరంగా భక్తులతో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ఇక, మొదటి ఘాట్‌రోడ్డులోని 35వ మలుపు, శ్రీవారి మెట్టు మార్గంలో మరికొంతమంది గస్తీలో ఉంటారు. భక్తులతో ముందుకు సాగడం, ముఖ్యమైన సూచనలు చేయడం, మార్గాల ప్రవేశాలను మూసివేసిన తర్వాత చివరి భక్తుడి వెనుకే తిరుమలకు చేరడం వంటి గూర్ఖా గార్డుల ప్రధాన విధులు.
విదేశీయులైనా.. శ్రీవారి సేవకులే!
ఒకటి రెండు సంవత్సరాల పాటు కాకుండా, ఏకంగా 20 ఏళ్లుగా నేపాలీ గూర్ఖాల సేవలు కొనసాగుతుండటం విశేషం. ఈ సుదీర్ఘ కాలంలో తరాలు మారినా, తిరుమలలో వీరి విధుల పరంపర కొనసాగుతోంది. కుటుంబాలతో కలిసి ఇక్కడే జీవనం సాగిస్తూ, స్వామివారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. స్వదేశానికి దూరంగా ఉన్నా, విధి నిర్వహణలో చూపుతున్న అంకిత భావం వీరిని తిరుమలలో ప్రత్యేకంగా నిలుపుతోంది. దేశ సరిహద్దులు వేరైనా, భాషలు వేరైనా.. తిరుమలలో విధి నిర్వహణ ద్వారా శ్రీవారి భక్తులకు వీరు అందిస్తున్న సేవలు ఎంతైనా అభినందనీయం.
జీతం కాదు... సంతృప్తి ముఖ్యం
తిరుమలలో గూర్ఖా గార్డు ఉద్యోగాలు మొదలైనప్పటి నుంచి విధులు నిర్వ హిస్తున్నా. జీతం తక్కువే కానీ సంతృప్తి కదా ముఖ్యం. స్వామి కొలువైన తిరుమల అటవీ, కొండల్లో ఉద్యోగం చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఏడాదిలో ఓసారి మాత్రమే నేపాల్‌కి వెళతాం. మిగిలిన కాలం మొత్తం స్వామి భక్తుల సేవలోనే. నడిచి వచ్చే భక్తులకు పటిష్ట భద్రతను కల్పించడమే మా లక్ష్యం.
గోపాల్ సింగ్
ఎలాంటి ఇబ్బంది కలగకుండా...
తిరుమలకు సగభాగం కాలినడక మార్గాలోనే తిరుమలకు వెళుతుంటారు. వారికి రక్షణ కల్పించడంతో పాటు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా, విద్యుత్ సమస్యలు ఉన్నా, మృగాలు కనిపించినా అధికారు లకు సమాచారం ఇస్తుంటాం. చివరి భక్తుడు క్షేమంగా తిరుమలకు చేరుకునేవరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటాం. రాత్రి, పగలు అనే తేడా మాకు లేదు.
రోజన్ థమాంగ్
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News And International News And Telugu News