లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:26 AM
నిత్య కల్యాణం పచ్చతోరణంగా తిరుమల క్షేత్రం ఎల్లప్పుడు విరాజిల్లుతునే ఉంటుంది. శ్రీనివాసుడు నిత్యపెళి ్లకొడుకుగా, శ్రీదేవి, భూదేవిలు పెళ్లి కూతుర్తె లుగా కల్యాణోత్సవంలో భక్తకోటికి కనువిందు చేస్తారు.
నిత్య కల్యాణం పచ్చతోరణంగా తిరుమల క్షేత్రం ఎల్లప్పుడు విరాజిల్లుతునే ఉంటుంది. శ్రీనివాసుడు నిత్యపెళి ్లకొడుకుగా, శ్రీదేవి, భూదేవిలు పెళ్లి కూతుర్తె లుగా కల్యాణోత్సవంలో భక్తకోటికి కనువిందు చేస్తారు. భక్తుల కోరికలు తీర్చుతూ... వారిచే నిత్య కల్యాణం చేయిం చుకోవడమంటే శ్రీవేంకటేశ్వరుడికి మహాప్రీతి.
15వ శతాబ్దంలో తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామివారికి నిత్యకల్యాణోత్సవం జరిగేలా చేశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ‘పెనచి పదోనాడు పెండ్లిపీట’ అనే అన్నమయ్య సంకీర్తన వాఖ్యాన్ని బట్టి అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవరోజు శ్రీవారి కల్యాణాన్ని నిర్వహించేవారని అర్థమవుతోంది. శాసనాలు, గ్రంథాల ఆధారంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం ప్రస్తావన మొట్టమొదటగా 1,546 శాసనం ప్రకారం తమిళ మాసమైన పంగుని నెలలో (మారి, ఏప్రిల్ మధ్యలో) అనురాధ నక్షత్రం రోజున ప్రారంభించి ఉత్తరాషాడ నక్షత్రానికి ముగిసేలా... ఐదు రోజుల పాటు జరిగేలా పెద్ద తిరుమలా చార్యులు కుమారులైన తిరువెంకటనాథన్ మాన్యాలు అందించారు. అలాగే 1,554 శాసనం ద్వారా తిరుమలై అయ్యంగార్ కూడా మాన్యాలు బహుకరించారు.
తొలుత ఘంటామండపంలోనే...
‘వేళ వేళ బొత్తులకు విందులారగించు కొంటా, వాలి కొలువుండే దిరువాముడి మంటపాన’ అనే కీర్తనను బట్టి పూర్వం కల్యాణోత్సవాన్ని శ్రీవారి ఆలయంలో తిరుమామణి మండపంగా పిలిచే... ప్రస్తుతం బంగారువాలికిని అనుకున్న ఉన్న ఘంటా మండపంలో నిర్వహించేవారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో కల్యాణోత్సవాలు శ్రీవారి విమాన ప్రాకారంలోని ఆనంద నిలయానికి పడమర వైపు ప్రస్తుత పాత కల్యాణమండపంగా పిలిచే మండపంలో జరిపేవారు. అలాగే కొద్ది కాలంపాటు తిరుమలరాయ మండపంలోనూ ఈ కల్యాణఘట్టాన్ని నిర్వహించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొన్నేళ్ల తర్వాత ఈ సేవ ఆర్జితంగా మార్చి శ్రీవారి ఆలయ ప్రాకారానికి వెలుపల ఉన్న సంపంగి ప్రాకారంలోకి కల్యాణోత్సవాన్ని ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నారు.

సింహాసనంపై ...
శ్రీవారి ఆలయంలో ప్రతీరోజు రెండో గంట పూర్తయిన తర్వాత శ్రీ,భూ సమేత శ్రీమలయప్పస్వామిని మూలమూర్తి గర్భాలయం నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపుగా కల్యాణమండపానికి తీసుకు వస్తారు. అప్పటికే సిద్ధం చేసిన ఓ సింహాసనంలో శ్రీవారి, ఉభయదేవేరులను మరో సింహాసనంపై వేంచేపు చేస్తారు. స్నానాదులు పూర్తిచేసుకుని దీక్షవస్ర్తాలు ధరించి, ద్వాదశోర్థ్వపుండ్రాలను (పన్నెండు నామాలు) ధరించిన అర్చకుడిని అర్చక నిలయం నుంచి సన్నధిగొల్ల దివిటీ చేతబట్టి ఆలయానికి తీసుకువస్తారు. ఈ కైంకర్యాలో అర్చకులతో పాటు వాద్యార్(పౌరోహితులు), జీయంగార్ల తరుపున ఏకాంగులు, దేవస్థానం తరుపున సన్నిధి పరిచారకులు, ప్రసాదాలు అందించడం కోసం పోటు పరిచారకులు, అన్నమయ్య వంశస్థులు, వేదపారాయణదార్లు, వారణమాయిరం పఠించడానికి జీయంగార్ల తరుపున అఽధ్యాపకులు, మేళగాళ్లు, సర్కార్ అని పిలిచే దేవస్థానం అధికారులు కూడా భాగస్వాములవుతారు.
కన్యాదానం చేసేది అన్నమయ్య వంశస్థులే...
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరుడికి కన్యాదాత తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆనందనిలయుడు నిత్య పెళ్లికొడుకైతే నిత్య నూతన కన్యాదాత. నేటికీ తిరుమల శ్రీవారి కల్యాణోత్సవంలో అన్నమయ్య వంశీయులు కోనేటిరాయుడుకి నిత్యం కల్యాణం చేయిస్తూ కన్యాదాతలుగా ప్రముఖ పాత్ర వహిస్తూ సముచిత సత్కారం పొందుతూనే ఉన్నారు. ఈ నిత్య కల్యాణోత్సవాన్ని నిర్వహించడమే కాక నిత్య పెళ్లికొడుకు, నిత్య పెళ్లికూతుర్ల వైభవం గూర్చి కీర్తనలతో కీర్తించారు అన్నమయ్య.
వైఖానస ఆగమనుసారం...
స్వామి, అమ్మవార్ల పెండ్లివేడుకను వైఖానస ఆగమం ప్రకారం నిర్వహిస్తారు. సంకల్పం, విష్వక్సేనారాధన, వరుణున్ని ప్రార్థిస్తూ పుణ్య వహచనం చేస్తారు. తర్వాత అంకురార్పణ, రక్షాబంధన కార్యక్రమంలో భాగంగా కంకణాలకు దేవతలను అవాహనం చేసి పూజ చేసిన అనంతరం ఉత్సవమూర్తులకు అర్చకులు కంకణధారణ చేస్తారు. ఆరాధన, విశేషహోమం, తెర, పట్టువస్ర్తాల సమర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహించిన పిదప మహాసంకల్పం పఠిస్తారు. ప్రవరలో భాగంగా స్వామి, అమ్మవార్ల నక్షత్రాలు, వారి పూర్వీకుల గోత్రనామాలు, విశేష గుణాలను కీర్తిస్తారు. అనంతరం అన్నమయ్య వంశస్థులు స్వామి వారి మామ స్థానం పాత్ర పోషిస్తూ కన్యా దానం చేయిస్తారు.
అనంతరం మాంగళ్య పూజను శాస్ర్తోక్తంగా నిర్వహించి మంగళ సూత్రాలను ధరింపజేస్తారు. లాజ హోమం, ప్రాయశ్చిత్త హోమం, పూర్ణాహుతిని నిర్వహించి హోమాన్ని ముగిస్తారు. హోమం నుంచి దర్భలతో స్వీకరించిన అగ్నిని నేతితో కలిపిన కాటుకవంటి అంజనాన్ని స్వామి, అమ్మవార్ల నుదుట సమర్పిస్తారు. దివ్యప్రబంధంలోని వారణ మాయిరం అనే దశకాన్ని గానం చేస్తుండగా... అర్చకులు, అన్నమయ్య వంశస్థులు కొబ్బరికాయలను దొర్లిస్తారు. తమిళుల పెళ్లిళ్లలో నేటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం. అలాగే స్వామి, అమ్మవార్లకు పూలమార్పు ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. స్వామి మాలను అమ్మవార్లకు, అమ్మవార్ల మాలలను స్వామికి ధరింపజేస్తారు. తర్వాత ఒకే పీఠంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అక్షతారోహణం (తలంబ్రాలు) నిర్వహించి కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ వివాహ ఘట్టంలో స్వామి అమ్మవార్ల మధ్య తెర ఉంచడం తెలుగు సంప్రదాయాన్ని తెలియజేయగా, వారణమాయిరం గానం చేస్తూ కొబ్బరికాయ దొర్లించడం అరవ సాంప్రదాయాన్ని సూచిస్తుంది.
భిన్నంగా మాంగళ్యధారణ శ్లోకం
దేశవ్యాప్తంగా వివాహ ప్రక్రియలు విభిన్నరీతుల్లో ఉన్నప్పటికీ మాంగళ్యధారణ మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటుంది. మాంగళ్యధారణ సమయంలో అందరు పలికే శ్లోకం ‘మాంగళ్య తంతునానేనా మమజీవన హేతునా, కంఠే భద్రామి సుభగేత్వం జీవ శరదాం శతం’ అంటే ‘నా జీవనానికి ఆధార భూతమైన ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. నువ్వు వంద శరత్తులు (వందేళ్లు) సుఖంగా జీవించు’ అని అర్థం. అయితే ఇదే శ్లోకాన్ని స్వామి కల్యాణోత్సవంలో మాత్రం భిన్నంగా పలుకుతారు. ‘మాంగళ్య తంతునానేనా లోక రక్షణ హేతునా, కంఠే భద్నామి సుభగే రక్షంతు భువనత్రయం’ అని పఠిస్తారు. అంటే ‘లోక కల్యాణం కోసం, ముల్లోకాల రక్షణ కసం ఈ మాంగల్యం ధరింపబడుతోంది’ అని అర్థం. ఇలా అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం వైభవం కొనసాగుతోంది.
కోరిన కోర్కెలు... పెరిగిన భక్తులు...
భారతీయ సనాతన ధర్మానికి మూలం నమ్మకం, ఈ జగత్తుకు సృష్టి-స్థితి-లయ కారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాగా, ‘అందరికాధారమైన ఆది పురుషుడు’ అంటూ అన్నమయ్య కీర్తించినట్టు జీవులను సర్వకాల సర్వావస్థలయందు రక్షించగలిగే సమర్థుడు శ్రీవేంకటేశ్వరుడే. భక్తులు తాము కోరే కోర్కెలు సిద్ధించడానికి ముఖ్యంగా అవివాహితులకు వివాహం కావడానికి స్వామికి కల్యాణం చేయిస్తామని మొక్కుకుని, ఆ కోర్కె నెరవేరి నప్పుడు వెంటనే కల్యాణోత్సవం చేయించే సంప్రదాయం తిరుమల క్షేత్రంలో అనాదిగా వస్తోంది. ఇలా భక్తులో బలంగా నమ్మక మేర్పడి తమ కోర్కెలు సిద్ధించిన తక్షణమే కల్యాణంలో పాల్గొనే భక్తుల రద్దీ కూడా పెరుగుతూ వస్తోంది. పెళ్లాడిన వెంటనే స్వామివారి కల్యాణోత్సవంలో భాగస్వాములైతే వైవాహిక జీవతం ఆనందమయం అవు తుందనే విశ్వసించే భక్తులు కూడా అధికమే.

ఆర్జితసేవగా మారిన కల్యాణం
ఆలయ ఆదాయాన్ని పెంచడంలో కల్యాణోత్సవం కీలకంగా మారింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల అవసరాలను తీర్చడానికి, మంచి ఏర్పాట్లు చేసేందుకు కల్యాణోత్సవాన్ని ఆర్జితంగా మార్చారు.
1948లో ఈటికెట్ ధర రూ.305. 12 మందిని సేవకు అనుమతించి బహుమానంగా 30 చొప్పున లడ్డూలు, అప్పాలు, 60 దోశలు, మూడు గంగాళాల అన్నప్రసాదాలు అందజేవారు.
1958-59 మధ్య కాలంలో టికెట్ ధరను రూ.500 పెంచడంతో పాటు 12 మందికి బదులు 10 మందిని అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఈ సేవను టీటీడీ తొలిసారిగా 1975లో ఆర్జితసేవగా ప్రవేశపెట్టింది. ప్రసాదాలను కూడా కుదించింది. 20 చొప్పున లడ్డూలు, వడలు, దోశ 15, అప్పాలు 15తో పాటు నూతనంగా వస్త్ర బహుమానాన్ని ప్రారంభించారు.
1980 జనవరి 1 నుంచి టికెట్ ధరను 1,500, 1981లో మరో రూ.వెయ్యిని జోడించి రూ.2000గా టికెట్ ధర పెరిగింది.
1990లో పట్టు ఉత్తరీయం, రవిక ఇచ్చేలా నిర్ణయం తీసుని ప్రసాదాలు కుదించారు. 15 చొప్పున లడ్డూలు, వడలు, అప్పాలు, చక్కరపొంగలి, దద్ద్యోజనం ఇచ్చేలా నిర్ణయించారు.
ఆ తర్వాత 1993లో టికెట్ ధర ఏకంగా 2,500కి పెంచారు.
టికెట్‌పై పదిమందిని అనుమతించే విధానాన్ని 1995 మే నెలలో రద్దు చేసి ఐదుగురికి పరిమితం చేశారు.
1997లో పట్టుకు బదులుగా కాటన్ ఉత్తరీయం, రవిక బహుమానంగా ఇస్తూ మార్పులు చేశారు.
1981లో ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతించేలా రూ.500 ప్రత్యేక కల్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత రూ.750కి పెంచారు.
2005 వరకు 750 ప్రత్యేక కల్యాణోత్సవంతో పాటు రూ.2,500 ఆర్జి కల్యాణోత్సవం (పెద్ద కల్యాణోత్సవం) రెండిటినీ కొనసాగించారు. పెద్ద కల్యాణోత్సవం భక్తులు ముందు వరసలో, ప్రత్యేక కల్యాణోత్సవం భక్తులు తర్వాతి వరుసలో కూర్చోబెట్టేవారు.
ఆతర్వాత రూ.2,500 పెద్ద కల్యాణోత్సవానికి భారీగా డిమాండ్ పెరిగిన క్రమంలో ఈ రెండు కల్యాణాలను దేవస్థానం రద్దు చేసింది.
2005 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రెండిటి స్థానంలో రూ.వెయ్యి టికెట్‌పై ఇద్దరిని అనుమతించే పద్ధతిని ప్రవేశపెట్టి నేటికీ కొనసాగిస్తున్నారు.
2020 వరకు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే వారికి రెండు చొప్పున పెద్ద లడ్డూలు, చిన్నలడ్డూలు, ఐదు చిన్నలడ్డూలు, ఉత్తరీయం, రవిక, రెండు కవర్లు బహు మానంగా ఇచ్చే వారు. తర్వాత ప్రసాదాలు రద్దు చేసి ప్రస్తుతం కేవలం ఉత్తరీయం, రవిక మాత్రమే అందజేస్తున్నారు.
ప్రస్తుతం కల్యాణోత్సవ టికెట్ ఇలా...
స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు టీటీడీ కొన్ని విధానాలను పాటిస్తోంది. వివిధ సిఫార్సుల ద్వారా అదనపు ఈవో కార్యాలయంలో డిస్ర్కిషనరీ కోటా, ఆన్‌లైన్‌లో, తిరుమలలోని సీఆర్వో ఆఫీస్‌లో లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లను కేటాయిస్తున్నారు. అలాగే వివాహం చేసుకుని ఏడురోజుల్లోపు తిరుమలకు వచ్చే 20 నూతన జంటలకూ సీఆర్వో కార్యాలయంలో కల్యాణోత్సవ టికెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ సేవలో నిత్యం 700 నుంచి 800 మంది భక్తులు పాల్గొంటున్నారు. కొవిడ్ సమయం నుంచి అనివార్య కారాణాలతో తిరుమలకు రాలేని గృహస్తుల కోసం వారి గోత్రనామాలతో పరోక్షంగా సేవలో పాల్గొనే అవకాశాన్ని ‘వర్చువల్ సేవ’ పేరుతోనూ కొనసాగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 2008 నుంచి ఎస్వీబీసీ ఛానల్ ద్వారా కల్యాణోత్సవాన్ని టీటీడీ ప్రత్యక్షప్రసారం చేస్తోంది.
కొవిడ్ సమయంలోనూ...
కొవిడ్ సమయంలో దేశంలోని అన్ని ఆలయాలు మూతపడినా తిరులేశుడి ఆలయంలో మాత్రం ఈ కల్యాణోత్సవం కొనసాగడం విశేషం. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో 2020 మార్చి నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలను రద్దు చేశారు. అయితే లోకకల్యాణం కోసం నిత్యం జరిపే ఈసేవను రద్దు చేయడం సరికాదనే పండితుల సూచన మేరకు కేంద్రం అనుమతితో ఆర్జితసేవలను రద్దు చేసినప్పటికీ గర్భాలయంలోని మూల విరాట్టు కైంకర్యాలతో పాటు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అయితే భక్తులెవ్వరిని అనుమతించకుండా లోకశ్రేయస్సు కోసం ఏకాంతంగా ఏడాదిపాటు నిర్వహించారు.
లోక శ్రేయస్సు కోసం...
లోక క్షేమం కోసం కేవలం తిరుమలలోనే కాక దేశ, విదేశాల్లోనూ శ్రీవారి కల్యాణోత్స వాలను నిర్వహిస్తున్నారు. 2012లో హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) బడ్జెట్‌తో ‘శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్’ ప్రారంభమైంది. కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ కల్యాణాలను నిర్వహించి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ పురుడుపోసుకుంది.
ఈ ప్రాజెక్ట్‌కు ముందు అన్నమయ్య ప్రాజెక్ట్ ద్వారా ‘గోవింద కల్యాణం’ పేరుతో కల్యాణాలను నిర్వహించారు.
‘శ్రీవారి వైభవోత్సవాలు ప్రాజెక్ట్’ కూడా తొలుత హెచ్‌డీపీపీలోనే ఉండేది. 2015లో శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌లో విలీనం చేశారు.
2017-18 వరకు ఈ ప్రాజెక్ట్‌ల ఖర్చు మొత్తాన్ని హెచ్‌డీపీపీకి కేటాయించే నిధుల్లోనే వినియోగించేవారు.
2018-19 నుంచి 2022-23 వరకు ప్రత్యేకంగా రూ.15 కోట్లు ఈప్రాజెక్ట్‌కు కేటాయించారు.
శ్రీనివాస కల్యాణాలను రెండు రకాలుగా నిర్వహిస్తున్నారు. వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో, ఎస్సీ,ఎస్టీ కాలనీలు, మత్స్యకారుల ప్రాంతాల్లో టీటీడీనే అన్ని ఖర్చులు భరించి నిర్వహిస్తుంది.
రెండవ కేటగిరీలో ఆర్గనైజర్లు, స్పాన్సర్ల ద్వారా నిర్వహిస్తారు. వేదకలు, కార్పెట్లు, ప్రసాదాలు, మేళం సిబ్బంది, సంభావనలు, ప్రయాణఖర్చులు వంటి అన్నిటిని నిర్వాహుకులే చూసుకుంటారు.
ఈ ఏడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో మన్యం జిల్లాలో 4 కల్యాణాలను నిర్వహించేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందించుకుంది.
2012 నుంచి ఇప్పటి వరకు మొత్తం 968 కల్యాణాలను నిర్వహించారు. ఇందులో 62 కల్యాణాలు అమెరికా, లండన్ వంటి ప్రాం తాల్లో అత్యంత వైభవం నిర్వహించారు.
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో శ్రీనివాస కల్యాణాలను నిర్వహించేందుకు టీటీడీ వద్ద ప్రత్యేకంగా 3 సెట్ల స్వామి, అమ్మ వార్ల విగ్రహాలు వీటినే టీటీడీ ధర్మప్రచార రథం ద్వారా ఆయా ప్రాంతాలకు తీసుకు వెళ్లి అక్కడి భక్తుల నడమ కల్యాణఘట్టాన్ని వైభవోపేతంగా చేస్తారు.
విదేశాల్లో జరిగే కల్యాణాలకు సంబంధించిన స్వామి, అమ్మవార్ల విగ్రహాలను నిర్వాహకులే తయారుచేయించుకుని ఆయా దేశాలకు చేరు స్తారు. సముద్రాలు దాటిన అర్చకులు గర్భాలయ ప్రవేశం ఆగమ విరుద్ధం కావడంతో కల్యాణాలు నిర్వహించే వేదపారాయణదారుల ద్వారా కల్యాణాలను నిర్వహిస్తారు. ఈ సమ యంలో భక్తుల నుంచి ఏవైనా కానుకలు అందితే వాటిని తీసుకువచ్చి స్వామి ఖజానాకు చేరుస్తారు. అయితే ఆ విగ్రహాలను మాత్రం నిర్వాహకులకే అప్పచెప్తారు. ఇలా విదేశా ల్లోనూ స్వామివారి కల్యాణాన్ని నిర్వహించి ఆయా ప్రాంతాలు, అక్కడి భక్తులు, సకల ప్రాణుల క్షేమం కోసం నిర్వహించడం టీటీడీకి ఆనవాయితీగా వస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News And International News And Telugu News