రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:32 AM
సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై శనివారం జరిగిన మిసైల్ దాడులను భారత్ ఖండించింది. సామాన్య పౌరులు, మౌలిక వసతులపై దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోగల కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం జరిగిన మిసైల్ దాడులను భారత్ ఖండించింది. సామాన్య పౌరులు, మౌలిక వసతులపై దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. తక్షణం ఈ దాడులను కట్టిపెట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఆదివారం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కష్ట సమయంలో సౌదీలకు తాము మద్దతుగా ఉన్నామని పేర్కొంది. వీలైనంత త్వరగా అక్కడ శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్టు తెలిపింది. రియాద్ విమానాశ్రయంపై ఈ వారం జరిగిన మూడో దాడి ఇది. ఈ ఘటనలో 12 మంది మరణించగా 300 మందికిపైగా గాయపడ్డారు. ఎయిర్‌పోర్టు కాంప్లెక్స్‌లోని 3వ, 4వ టర్మినల్స్‌పై ఈ మిసైల్ దాడి జరిగింది.
ఇటీవల కాలంలో హూతీలు సౌదీపై దాడులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టులు, చమురు రంగానికి చెందిన మౌలిక వసతులు, ట్యాంకర్లపై దాడులతో కలకలం సృష్టిస్తున్నారు. సౌదీతో గతంలో కుదిరిన సంధి జులైలో కుప్పకూలడంతో హూతీలు మళ్లీ విరుచుకుపడుతున్నారు. గురువారం హూతీలు రియాద్ ఎయిర్‌పోర్టుపై జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు.
ఇదిలా ఉంటే, హూతీలపై సౌదీతో కలిసి తాము దాడులు ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం తెలిపారు. హూతీ తాజా దాడుల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేమూ రంగంలోకి దిగవచ్చు. ఈ విషయాన్ని పరిశీలిస్తాము. హూతీలు తాజాగా చేసిన దాడి గురించి ఇప్పుడే తెలిసింది. అతి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాము’ అని ట్రంప్ అన్నారు.
యెమెన్‌లో నాలుగేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది. సౌదీ మద్దతు ఉన్న ప్రభుత్వంపై హూతీలు తిరుగుబాటు చేశారు. ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకున్నారు. ఐరాస మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం జులైలో కుప్పకూలడంతో మళ్లీ పరస్పర దాడులు మొదలయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. 12 మంది మృతి, 300 మందికి గాయాలు!
ఉక్రెయిన్ ప్రజలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిది.. ట్రంప్ వ్యాఖ్య