Share News

రియాద్‌ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. 12 మంది మృతి, 300 మందికి గాయాలు!

ABN , Publish Date - Oct 11 , 2026 | 07:49 AM

సౌదీ అరేబియాలోని రియాద్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మిసైల్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేసి, పలు విమానాలను దారి మళ్లించారు.

రియాద్‌ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. 12 మంది మృతి, 300 మందికి గాయాలు!
Missile Attack On Saudi's Riyadh Airport

ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలో క్షిపణి దాడులు మరోసారి కలకలం రేపాయి. రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు సహా బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు, అమెరికా, పాలస్తీనా, ఈజిప్టు, జోర్డాన్‌, సిరియా, సుడాన్‌ దేశాలకు చెందిన వారున్నట్టు సమాచారం.


ఖలీద్ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే మూడు, నాలుగో టెర్మినల్‌‌పై ఈ మిసైల్ దాడి జరిగినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయడం సహా పలు విమానాలను దారి మళ్లించారు. అయితే.. హౌతీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు కారణమని సౌదీ సంకీర్ణ దళాలు ఆరోపించాయి. దీనికి తప్పకుండా ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించాయి. కానీ.. ఈ ఘటనపై హౌతీల ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు.


రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై దాడిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఖండించారు. దాడిలో యూఎస్ పౌరుడొకరు మృతిచెందినట్టు ఆయన ధ్రువీకరించారు. ఈ దాడితో సౌదీకి మద్దతుగా సైనిక చర్యల్లో అమెరికా పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ విషయమై సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో మాట్లాడతామన్నారు.


కాగా.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారైన సౌదీపై వరుస దాడులు ప్రాంతీయ భద్రతతో పాటు చమురు మార్కెట్లపైనా ప్రభావం చూపుతున్నాయి. వారం రోజులుగా సౌదీ విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు పెరిగినట్లు తెలుస్తోంది. హౌతీలపై సౌదీ సంకీర్ణ దళాలు పెద్దఎత్తున సైనిక చర్య చేపట్టాక ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. 2015లో యెమెన్‌ అంతర్యుద్ధంలో సౌదీ జోక్యంతో హౌతీలతో యుద్ధం ప్రారంభమైంది. 2022లో కాల్పుల విరమణ ఒప్పందంతో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ.. ఇటీవల మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఇవీ చదవండి:

పసిఫిక్ కాదు.. ట్రంప్ సముద్రం.. పేరు మార్చే యోచనలో అమెరికా అధ్యక్షుడు

నోబెల్ దక్కలేదని ట్రంప్ అసహనం.. విజేత పిళ్లైపై విమర్శలు.!

Updated Date - Oct 11 , 2026 | 07:49 AM