Share News

వెంకన్న హుండీలో విదేశీ కరెన్సీ

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:58 AM

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుమల శ్రీవారి వెంకన్న హుండీలో విదేశీ కరెన్సీ కానుకలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి.

వెంకన్న హుండీలో విదేశీ కరెన్సీ
Tirumala Tirupati

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుమల శ్రీవారి వెంకన్న హుండీలో విదేశీ కరెన్సీ కానుకలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తున్న క్రమంలో ఇప్పటికే దాదాపు 157 దేశాలకు పైగానే కరెన్సీ గోవిందుని హుండీలో చేరడం గమనార్హం. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు తమ స్తోమతకు తగిన విధంగా నగదుతో పాటు బంగారు, వజ్రాలు, ప్లాటినం, వెండి, బియ్యం, వస్ర్తాలు, భూములు, ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, డీడీలు, చెక్‌లు వంటి వాటిని కానుకలుగా వేస్తారు. వీటితో పాటు స్వామి హుండీ గంగాళంలో 1980 నుంచి విదేశీ కరెన్సీ కూడా కానుకలుగా అందడం మొదలయ్యాయి. అంతకుముందు అప్పుడప్పుడు కనిపించే విదేశీ కరెన్సీ 1980 నుంచి తరుచూ రావడం ఆరంభమైంది.


ఇప్పటికే 157 దేశాల కరెన్సీ

2000 నుంచి ఇప్పటి వరకు వచ్చిన హుండీ లెక్కింపులను పరిశీలిస్తే దాదాపు 157కు పైగా వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ హుండీ ద్వారా రావడాన్ని అధికారులు గుర్తించారు. ప్రపంచంలో 195 దేశాలుంటే... 157 దేశాల కరెన్సీ రావడం ప్రత్యేకం. 2007 వరకు కూడా కేవలం 15 నుంచి 30లోపు దేశాలకు సంబంధించిన కరెన్సీ మాత్రమే కనిపించేది. ఆ తర్వాత స్వదేశీ నగదుతో విదేశీ కరెన్సీ ప్రవాహం అధికమైంది. ఇతర దేశాలకు సంబందించి కాయిన్స్‌తో పాటు నోట్లు అధికంగా రావడం మొదలయ్యాయి.


2010 వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే... సింగపూర్‌, అమెరికా డాలర్లు, యూరో సెంట్లు, బ్రిటిష్‌ పౌండ్లు, మలేషియా, ఆస్ర్టేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల నగదు అధికంగా ఉండేవి. ఆ తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీ కానుకలుగా రావడం పెరిగిపోయింది. దీంతో 2021 నాటికే 157 దేశాల నగదు చేరింది. స్వామి హుండీలో పాకిస్తాన్‌ కరెన్సీ కూడా లభించడం గమనార్హం. ప్రతీ ఏటా పరకామణి లెక్కింపుల రికార్డుల్లో పాకిస్తాన్‌ కరెన్సీ వివరాలు కూడా నమోదవుతున్నాయి. అత్యధికంగా అమెరికా, మలేషియా, సింగపూర్‌తో పాటు యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) దేశాల కరెన్సీ అధికంగా ఉంటోంది.


book6.3.jpgవిదేశీ కరెన్సీ ద్వారా రూ.కోటి ఆదాయం

2004లో దాదాపు 10 టన్నుల విదేశీ కరెన్సీలను టీటీడీ విక్రయించి దాదాపు రూ.కోటి ఆదాయాన్ని పొందింది. అందులో 80 వేల సింగపూర్‌ డాలర్లు, 1.6 లక్షల అమెరికన్‌ డాలర్లు, .3 వేల యూరో సెంట్లు, 35 వేల బ్రిటిష్‌ పౌండ్లు, 8 లక్షల మలేషియన్‌ కరెన్సీ, 4 వేల ఆస్ర్టేలియన్‌ డాలర్లు, వెయ్యి దక్షిణాఫ్రికా రాండ్లు, 15వేల కెనిడియన్‌సెంట్లు, 10 వేల లంకన్‌ రూపాయలు ఉన్నాయి.

  • 2007లోనూ డిసెంబరు నెల చివరి వారంలోనూ ఆరు రోజుల్లో హుండీ ఆదాయం రూ.9 కోట్లకు చేరుకుని అప్పట్లో రికార్డు సృష్టించింది. దాదాపు 14 దేశాలకు చెందిన కరెన్సీ హుండీలో చేరింది.

  • 2015లో రూ.44.81 కోట్లు ఇతర దేశాల కరెన్సీ ద్వారా ఆదాయం లభించింది.

  • 2016లో జనవరి నుంచి డిసెంబరు వరకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.వెయ్యి కోట్లకుపైగా లభించింది. ఇందులోనూ విదేశీ కరెన్సీ 50.63 కోట్లు లభించింది.

  • 2020-21 కరోనా సమయంలో స్వామి హుండీలో రూ.1.92 కోట్లు ఇతర దేశాల నగదు చేరడం గుర్తించదగిన విషయం.


2010 తర్వాత స్వదేశీ నగదుతో పాటు విదేశీ నగదు కూడా భారీగా రావడం మొద లైంది. ఈక్రమంలో శ్రీవారి వార్షిక హుండీ ఆదాయంలో విదేశీ కరెన్సీ కీలకంగా మారింది. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా కేవలం విదేశీ కాయిన్స్‌, నోట్ల ద్వారానే టీటీడీ రూ.201,65,97,829 ఆదాయం లభించడం గమనార్హం. గడిచిన పదేళ్లలో ఏడాదికి సగటున రూ.20.16 కోట్లు స్వామి ఖజానాకు చేరాయి. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం టీటీడీ గుర్తింపు సంస్థలకు (మనీ ఛేంజర్స్‌) ఈ విదేశీ కరెన్సీని ఎప్పటికప్పుడు వేలం ద్వారా అందజేసి నగదు పొందుతోంది. నాణేలైతే 2003 వరకు బరువు ప్రాతిపదికన విక్రయం జరిగేది.


book6.jpgకానీ ఆ తర్వాత ఆయా దేశాల నామముద్రల ప్రకారం పీస్‌రేట్‌ విధానం ద్వారా విక్రయాలు జరుగు తున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌సీఆర్‌ఏ మార్గదర్శ కాలను అనుగుణంగా తిరుమల ఎస్‌బీఐ బ్రాంచ్‌ నుంచి న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ శాఖలో జమ చేస్తున్నారు. కాగా, రెండేళ్ల క్రితం టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌) నిబంధనలను ఉల్లంఘిం చిందనే వివాదం కూడా నడిచింది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు తెలియజేయడం లేదనే రిపోర్టు ఆధారంగా టీటీడీకి జరిమానా కూడా విధించారు. అయితే హుండీలో సమర్పించే కానుకలు కావడంతో ఈ విరాళాలను ‘శ్రీవారికి సమర్పించే కానుకలు’గా పరిగణిస్తూ దాతల వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదంటూ యాక్ట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో తిరిగి ఫారెన్‌ కరెన్సీ మార్పిడి కొనసాగింది.


ఇలా కలియుగ వైకుంఠనాధుడి వైభవం సరిహద్దులు దాటి విస్తరించిందనడానికి తిరుమల హుండీనే సాక్ష్యంగా మారింది. హుండీ అనేది కేవలం డబ్బు సేకరణకు మాత్రమే సాధనం కాదు. మిక్కిలి భక్తికి ప్రతీక. మలేషియా నుంచి అమెరికా, పాకిస్తాన్‌ నుంచి యూరప్‌ వరకు భక్తులు సమర్పించిన విరాళాలు బ్రహ్మాండ నాయకుడి వైభవాన్ని ప్రతిధ్వనింప చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...

అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 11:58 AM