Share News

Srisailam Temple: ఈసారి ప్రత్యేకంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 08:37 PM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరావు దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 Srisailam Temple: ఈసారి  ప్రత్యేకంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఈవో కీలక ఆదేశాలు
Srisailam Temple

నంద్యాల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో (Srisailam Bhramaramba Mallikarjuna Swamy Temple) ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరావు ఇవాళ(శనివారం) దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సుమారు 30 శాతం మంది భక్తులు ఎక్కువగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.


పకడ్బందీగా క్యూలైన్లు..

ప్రధానంగా క్యూలైన్ల నిర్వాహణ, భక్తులకు తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య ఏర్పాట్లపై చర్చించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా ఆలయానికి చేరుకుంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, క్యూలైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, వేచి ఉండే సమయంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.


అటవీ ప్రాంతం వెంట వచ్చేవారికి..

అలాగే, అటవీ ప్రాంతం వెంట నడకదారిలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈవో స్పష్టం చేశారు. నడకదారిలో లైటింగ్, వైద్య సహాయం, భద్రతా చర్యలు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం అదనంగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, భక్తులకు స్పష్టమైన సూచనలు, మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈవో శ్రీనివాసరావు.


అదనపు సిబ్బందిని నియమించుకోవాలి..

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లన్నీ ఈ నెల చివరి నాటికి పూర్తిచేయాలని ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. ప్రతి విభాగం తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

వైసీపీ హయాంలో డ్రగ్స్‌కి.. ఏపీ క్యాపిటల్‌గా ఉండేది..

గంజాయికి ‘నో’ చెప్పి భవిష్యత్ సురక్షితం చేసుకోండి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 09:03 PM