కాళేశ్వర క్షేత్రానికి కొత్త రూపు
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:28 AM
దక్షిణ భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి సర్వం సిద్ధమైంది.
రూ.198 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణానికి సర్వం సిద్ధం
శృంగేరి పీఠం దిశానిర్దేశంతో పనులు
17న ఉదయం 8.15 గంటలకు ముహూర్తం
ప్రత్యామ్నాయంగా ఆది ముక్తీశ్వరాలయంలో దర్శనాలు
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక
మహదేవపూర్(కరీంనగర్): దక్షిణ భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. శృంగేరి శారద పీఠాధిపతుల దిశానిర్దేశం, ఆధ్యాత్మిక అనుబంధంతో సుమారు రూ.198 కోట్ల వ్యయంతో ఈ కార్యాన్ని చేపడుతున్నారు. ఈనెల 17న ఉదయం 8.15 గంటలకు శృంగేరి శిష్య బృందం ఆధ్వ ర్యంలో శాస్త్రోక్తంగా తొలగింపు పూజలు నిర్వహించను న్నారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, ఆలోపే ప్రధాన గర్భగుడి పనులు పూర్తి చేయాలని సంకల్పించారు.
తమిళ శిల్పులు
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన గర్భగుడి లోని అత్యంత పవిత్రమైన ద్విలింగాల పానవట్టం కొల తలను తమిళనాడుకు చెందిన ప్రముఖ శిల్పులు ఇప్ప టికే గురువారం సేకరించారు. గర్భగుడిలోని ద్విలింగాల నమూనాను అదే కొలతలతో ఆది ముక్తీశ్వరాలయం లోని బాలాలయంలో ప్రతిష్ఠించనున్నారు. పాత నిర్మా ణాల తొలగింపు సమయంలో గర్భగుడిలోని ప్రధాన ద్విలింగాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వాటి పైభాగంలో ఇనుముతో కూడిన ప్రత్యేక పైకప్పు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
రాతి కట్టడాలతో కొత్త వైభవం
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో 1982 నాటి పాత ఇటుక, సిమెంట్ కట్టడాలను, అనుబంధ ఆలయాలను, ప్రాకారాలను, రాజగోపురాలను పూర్తిగా తొలగించనున్నారు. భవిష్యత్ తరాల కోసం కృష్ణశిలలతో (రాతి కట్టడాలు) ఆలయాన్ని అద్భుతంగా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సమయానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆ గడువులోగా ప్రధాన గర్భగుడితోపాటు శుభానందాదేవి అమ్మవారి ఆలయం, సరస్వతీదేవి ఆలయాల నిర్మాణాలను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఈనెల 17న శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శిష్య బృందంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ తొలగింపు, పునర్నిర్మాణ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాగా, ఆలయ పునర్నిర్మాణ పనులు సాగుతున్నంత కాలం భక్తుల ప్రత్యామ్నాయ దర్శనాలపై ఉన్న ఉత్కంఠకు అధికారులు ముగింపు పలికారు. ఆది ముక్తీశ్వరాలయంలో బాల ఆలయాలను ఏర్పాటు చేసి దర్శనాలు కల్పించాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News