Share News

రంగుల గణనాథుడికే జై..

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:36 AM

వినాయక చవితి సమీపిస్తుండడంతో విఘ్నేశ్వరుల విగ్రహాల కొనుగోలు ఊపందుకుంది.

రంగుల గణనాథుడికే జై..
Ganesh Chaturthi 2026

  • నామమాత్రంగా మట్టి విగ్రహాల విక్రయాలు

  • రంగుల వినాయకులనే కొంటున్న భక్తులు

  • పర్యావరణానికి విఘాతమంటున్న నిపుణులు

షాద్‌నగర్‌(రంగారెడ్డి): వినాయక చవితి సమీపిస్తుండడంతో విఘ్నేశ్వరుల విగ్రహాల కొనుగోలు ఊపందుకుంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వాడవాడలా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. భారీ వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి, మండపాలకు తరలిస్తున్నారు. కాగా, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే ప్రతిష్ఠించి పూజించాలని చెబుతున్నా.. యువత మాత్రం జిప్సం, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసి, రసాయనిక రంగులు వేసిన భారీ విగ్రహాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. కొందరు మాత్రమే మట్టి విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు.


పీవోపీ విగ్రహాలకే మొగ్గు

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో నిర్వహించే ఉత్సవాలకు జిప్సం, పీవోపీలతో తయారు చేసి, రసాయనిక రంగులు వేసిన విగ్రహాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. వేలల్లో పీవోపీ విగ్రహాలు విక్రయించబడుతుంటే పదుల్లో కూడా మట్టి వినాయకులను కొనుగోలు చేయడం లేదు. షాద్‌నగర్‌ వినాయకగంజ్‌ వినాయక విగ్రహాలకు పెద్ద మార్కెట్‌గా మారింది. అందులో పూర్తిస్థాయిలో పీవోపీ విగ్రహాలనే విక్రయిస్తున్నారు. పట్టణంతో పాటు తయారు కేంద్రాల్లో సైతం ఆ విగ్రహాలే దర్శనమిస్తున్నాయి.


ఒకే ఒక్కరు కొన్ని మట్టి విగ్రహాలను పెట్టి విక్రయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. చాలామంది మట్టి విగ్రహాలను కొనుగోలు చేయడం లేదని, ఒకవేళ తీసుకొస్తే నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. మట్టితో తయారు చేసిన భారీ విగ్రహాలను తీసుకువెళ్లలేమని, ట్రాన్స్‌పోర్టులో తీసుకెళ్తుండగా, ప్రతిష్ఠించే సమయంతో పాటు నిమజ్జనం చేసే సమయంలో భిన్నమవుతాయని, అందుకే పీవోపీ విగ్రహాలకే ప్రాధాన్యతనిస్తున్నామని యువకులు చెబుతున్నారు.


gane1.jpgపర్యావరణానికి విఘాతం

జిప్సం, పీవోపీలతో తయారు చేసి, రసాయనిక రంగులు వేసిన వినాయకులతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిప్సం కలిపిన పీవోపీతో తయారు చేసే విగ్రహం నీటిలో సులభంగా కరగక, వ్యర్థాలు చెరువులు, కుంటల్లో పేరుకుపోతాయని చెబుతున్నారు. రసాయనిక రంగులతో నీరు కలుషితమై పక్షులు, జీవరాసులకు, వ్యవసాయ పంటలకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. మట్టి వినాయకులను నీటిలో నిమజ్జనం చేసిన గంటల్లోనే కరిగిపోతాయని స్పష్టం చేస్తున్నారు.


భక్తితో పూజించాలి

వినాయక ఉత్సవాలు ఆర్భాటంతో కాకుండా భక్తి తో జరుపుకోవాలి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువక చెరువులు కుంటల్లోకి నీరు చేర లేదు. భారీ పీ వోపీ విగ్రహాలను కాకుండా మట్టి వినాయకులను తీసుకువెళ్లి పూజిస్తే నిమజ్జనానికి, పర్యావరణానికి సమస్య ఉండదు. యువత ఆలోచించాలి, భక్తితో చేసే పూజలు సమాజానికి మేలు చేయాలే తప్ప, ప్రకృతికి విఘాతం కలిగించొద్దు.

  • పి.సాయీశ్వర్‌రెడ్డి, షాద్‌నగర్‌


యువతలో మార్పు రావాలి

యువతలో మార్పు రా వాలి. పర్యావరణానికి హాని కల్గిగించని మట్టి వి నాయకులనే పూజించాలి. హైదరాబాద్‌ లాంటి నగరాలలో కాస్త మార్పు కనిపిస్తున్నా.. గ్రామీణ యువ త నేటికీ పీవోపీతో తయారు చేసిన భారీ విగ్రహాలవైపే మొగ్గు చూపుతున్నారు. మనం తాగే చెరువు నీటిని మనమే కలుషితం చేసుకోకుండా మట్టి వినాయకులను పూజించాలి.

  • మల్లేష్‌, విగ్రహాల వ్యాపారి


ఈ వార్తలు కూడా చదవండి:

22ఏ ఉచ్చులో పట్టా భూములు

ఆపదలో ప్రాణదాతగా ప్రథమ చికిత్స

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 11:36 AM