వలపు వల.. యువత గిలగిలా..
ABN , Publish Date - Sep 29 , 2026 | 09:25 AM
ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ ఇలా.. ఏదేని సోషల్ మీడియా ద్వారా సైబర్ కేటుగాళ్లు తీయని మాటలతో అమాయకులను వలలో వేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.
మాయమాటలకు చిక్కి.. రూ.కోట్లు కోల్పోతున్న సిటీజనులు
సోషల్‌మీడియా వేదికగా సాగుతున్న సైబర్ మోసం
ట్రేడింగ్ ఉచ్చులోకి దింపి రూ.కోట్లకు టోకరా
ఫేస్‌బుక్ స్టోర్స్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.2.36కోట్లు..
పెళ్లికి ముందే సంపాదన అంటూ రూ.కోటీ 46లక్షల మోసం
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ: ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ ఇలా.. ఏదేని సోషల్ మీడియా ద్వారా సైబర్ కేటుగాళ్లు తీయని మాటలతో అమాయకులను వలలో వేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తక్కువ సమయంలో కోట్ల రూపాయలను సంపాదించవచ్చని మాయమాటలు చెబుతూ ఉన్నదంతా దోచుకుంటున్నారు. వీరి మాయాజాలానికి ఉన్నత చదువులు చదివిన వారు సైతం నిలువుదోపిడీకి గురవుతున్నారు. చివరాఖరికి తాము మోసపోయామని గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి కేసులు నగరంలో ఇటీవల క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పెళ్లికి ముందే కోట్లు సంపాదిద్దాం అంటూ..
‘సంగం మ్యాట్రిమోనీ’లో నకిలీ ప్రొఫైల్ అప్‌లోడ్ చేసిన మహిళ.. నగరానికి చెందిన వ్యక్తి ప్రొఫైల్ నచ్చిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకుంది. అయితే పెళ్లికి ముందే కోట్లు సంపాదించాలని, అందుకు తన వద్ద మంచి ప్లాన్ ఉందని మభ్యపెట్టింది. నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టించి లింకు పంపింది. ఇన్వెస్టిమెంట్ పేరుతో రూ.1.46 కోట్లు పెట్టుబడి పెట్టించి, ఆ మొత్తాన్ని కాజేసి ఉడాయించింది.
కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ.. ఫేస్‌బుక్ స్టోర్స్‌లో పెట్టుబడులు పెట్టించి రూ. 2.36 కోట్లు కొల్లగొట్టింది.
లంగర్‌హౌస్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ఓ మహిళ తన పేరు సాయిప్రీతి, తనది వైజాగ్ అని, ఇటీవలే యూకే వచ్చినట్లు నమ్మించింది. ఆ తర్వాత ఆమె తన మాయమాటలతో ఆన్‌లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ గురించి చెబుతూ రూ. 10.21లక్షలు పెట్టుబడిగా పెట్టించింది. డబ్బు చేతికి అందగానే సదరు మహిళ కాంటాక్టు కట్ చేసి పరారైంది.

నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారికి ఫేస్‌బుక్ రిలేటెడ్ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దాన్ని ఫాలో కాగా.. కేటుగాళ్లు లింకు పంపించారు. ఐపీఓ షేర్‌లను కొనుగోలు చేయించి ప్రారంభంలో మంచి లాభాలు వచ్చేలా చేశారు. ఆ తర్వాత బాధితుడు రూ.61.52లక్షలు పెట్టుబుడులు పెట్టగా.. రూ.2.99 కోట్ల లాభాలతో ఖాతాలో డబ్బు ఉన్నట్లు వర్చువల్‌గా చూపించారు. విత్‌డ్రా ఆప్షన్ క్లోజ్ చేసి ముఖం చాటేయడంతో మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కొండాపూర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సైతం ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమై మాయమాటలతో ఫేస్‌బుక్ స్టోర్‌లో ఏడు నెలల్లో సుమారు రూ.2.36 కోట్లు పెట్టుబడులు పెట్టించింది. ఆ తర్వాత ఆ డబ్బుతో ఉడాయించింది. ఇవి కేవలం ఇటీవల హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే.. ఇలాంటి ఘటనలు అనేకం.
అపరిచితులను నమ్మొద్దు..
సోషల్‌మీడియాలో వచ్చే అపరిచితుల ఫ్రెండ్ రిక్వె్‌స్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయవద్దు. ట్రేడింగ్, ఇన్వె్‌స్టమెంట్ల పేరుతో వచ్చే నకిలీ లింక్‌లు, ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేసి మోసపోవద్దు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
సజ్జనార్, పోలీస్ కమిషనర్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి:
అంచనాలకు అందని స్థాయిలో బంగారం పతనం
హైదరాబాద్‌లో నేడు విద్యుత్ కోత.. ఈ ప్రాంతాల్లో పవర్ కట్
Read Latest AP News And Telangana News And International News And Telugu News