అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్
ABN , Publish Date - Sep 29 , 2026 | 08:08 AM
గ్యాంగ్‌స్టర్ సతీందర్ జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను అమెరికన్ ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చింది.
ఇంటర్నెట్ డెస్క్: గ్యాంగ్‌స్టర్ సతీందర్ జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను అమెరికన్ ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో చేర్చింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి 1 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. ఎఫ్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర అమెరికాలో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలకు గోల్డీ బ్రార్ నేతృత్వం వహిస్తున్నాడు. అమెరికా, కెనడాలో పలు నేరాల వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని అధికారులు పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో ఈ గ్యాంగ్ పలు హింసాత్మక నేరాలకు పాల్పడిందని చెప్పారు.
బ్రార్ ప్రమాదకారి అని, పరారీలో ఉన్నాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలోనే తలదాచుకుంటున్నాడని చెప్పింది. భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు చేసేందుకు అమెరికా ఇటీవల ఏడాది పాటు ఆపరేషన్ హార్డ్‌బాల్ నిర్వహించింది. ఇందులో భాగంగా మొత్తం 37 మంది నిందితులను గుర్తించింది. బిష్ణోయ్ సహా మూడు గ్యాంగులకు సంబంధించిన వ్యక్తులపై అధికారులు జులైలోనే పలు ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.
బిష్ణోయ్ గ్యాంగ్‌కు బ్రార్ ఉత్తర అమెరికాలో నేతృత్వం వహిస్తున్నాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. పోలీసు, రాజకీయ నాయకుల హత్యలు, కాల్పులు, కిడ్నాపింగ్ కేసులు, బలవంతపు వసూళ్లు, దాడులు, మాదకద్రవ్యాల అక్రమరవాణా కేసుల్లో బ్రార్ నిందితుడిగా ఉన్నాడని చెప్పింది. జులై 1న బ్రార్‌పై అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యింది. బిష్ణోయ్ అంతర్జాతీయ నేరకార్యకలాపాల్లో కూడా బ్రార్ కీలకంగా ఉన్నాడని చెప్పింది.
ఈ వార్తలనూ చదవండి:
నిఘా డ్రోన్ మా అధీనంలోనే ఉంది: అమెరికా
భారీ వర్షాలకు నేపాల్ అతలాకుతలం