Share News

నిఘా డ్రోన్ మా అధీనంలోనే ఉంది: అమెరికా

ABN , Publish Date - Sep 28 , 2026 | 03:27 PM

హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనను యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వాదనలు పూర్తిగా నిరాధారమైనవి, నిరాశతో చేసిన ప్రకటనలని సెంట్రల్ కమాండ్ కొట్టిపారేసింది.

నిఘా డ్రోన్ మా అధీనంలోనే ఉంది: అమెరికా
US Denies Iran’s Claim of Capturing Underwater Drone in Strait of Hormuz

వాషింగ్టన్ డీసీ, సెప్టెంబర్ 28: హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనను యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వాదనలు పూర్తిగా నిరాధారమైనవి, నిరాశతో చేసిన ప్రకటనలని కొట్టిపారేసింది.


కాగా, ఇరాన్ ప్రభుత్వ టీవీ (IRIB) నివేదికల ప్రకారం, IRGC నావికాదళం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలాల్లో గూఢచర్యం నిర్వహిస్తోన్న అమెరికన్ అన్ మ్యాన్డ్ అటానమస్ వెహికల్ (AUV) ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇది అమెరికా మిలిటరీకి చెందిన 'Mk 18 Mod 2 Kingfish' (గతంలో REMUS 600గా గుర్తించారు) రకానికి చెందిన అధునాతన అండర్‌వాటర్ నిఘా డ్రోన్ అని ఇరాన్ తెలిపింది.

సైనిక నిఘా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను ఉపయోగించి, సమన్వయంతో కూడిన సంక్లిష్ట ఆపరేషన్ ద్వారా ఈ సబ్‌మెర్సిబుల్‌ను చేజిక్కించుకున్నట్లు IRGC పేర్కొంది. డ్రోన్ లోని సమాచారాన్ని, డేటాను విశ్లేషించడానికి దానిని ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందానికి అప్పగించినట్లు తెలిపింది.

ఇరాన్ ప్రకటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందిస్తూ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో విధుల్లో ఉన్న తమ మానవ రహిత డ్రోన్ వ్యవస్థలన్నీ భద్రంగా ఉన్నాయని, ప్రతీ డ్రోన్ తమ వద్ద రికార్డయి ఉందని తెలిపారు. ఇరాన్ ఆర్మీ చేసిన ఈ ప్రకటనలు స్పష్టమైన నిరాశ నుంచి వచ్చినవని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా IRGC నావికాదళం మరింత ఘాటుగా స్పందిస్తూ, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా వెళ్లే అనధికారిక, ప్రమాదకర నౌకల రాకపోకలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా, ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని మూసివేసినట్లు పునరుద్ఘాటించింది.


ఈ వార్తలనూ చదవండి:

ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ

పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా..

Updated Date - Sep 28 , 2026 | 04:12 PM