ఆన్‌లైన్ టాస్కుల పేరుతో రూ.12.56 లక్షలు స్వాహా!
ABN , Publish Date - Oct 30 , 2026 | 09:48 AM
ఆన్‌లైన్‌లో చిన్న చిన్న టాస్కులు పూర్తి చేస్తే రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదించవచ్చంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.12.56 లక్షలు కాజేశారు.
రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదించొచ్చని మోసం
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్‌లో చిన్న చిన్న టాస్కులు పూర్తి చేస్తే రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదించవచ్చంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.12.56 లక్షలు కాజేశారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదీనాగూడ కృష్ణానగర్‌కు చెందిన 33 ఏళ్ల కొండపల్లి అభిషేక్‌కు సెప్టెంబరు 25న మిష్కా త్రివేది అనే వ్యక్తి నుంచి టెలిగ్రామ్‌లో సందేశం వచ్చింది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పనులు ఉన్నాయని, ఐదు నక్షత్రాల రేటింగులు ఇస్తే ఒక్కో టాస్కుకు రూ.880 చెల్లిస్తామని నమ్మించారు.
తొలుత కొన్ని టాస్కులు పూర్తి చేయించిన అనంతరం బాధితుడి బ్యాంకు వివరాలు తీసుకొని డబ్బులు బదిలీ చేశారు. దీంతో ఆన్‌లైన్ పనుల ద్వారా ఆదాయం పొందవచ్చని అతడు నమ్మాడు. దీంతో బాధితుడిని మ్యాజిక్ బ్రిక్స్ పేరుతో ఉన్న వీఐపీ గ్రూపులో చేర్చారు. బుకింగ్‌లు పూర్తి చేసి స్ర్కీన్‌షాట్లను ఏజెంట్‌కు పంపితే, అన్ని పనులు పూర్తయిన తర్వాత విత్‌డ్రా కోడ్ ఇస్తామని చెప్పారు. కస్టమర్ సపోర్టు పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఖాతా ద్వారా కూడా బ్యాంకు వివరాలు తీసుకొని కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించారు. ఆ తర్వాత ‘వెల్ఫేర్ టాస్క్’ పేరుతో రూ.30 వేలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం రూ.67,881, రూ.1,50,157, రూ.4,86,762 విలువైన ప్రైమ్ టాస్కులు అప్పగించారు.
వెబ్‌సైట్‌లో పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపిస్తూ బాధితుడిని మరింత పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. మొత్తం రూ.12లక్షలు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా, సూచించిన విధానాన్ని పాటించలేదనే కారణంతో అతడి ఖాతాను నిలిపివేశారు. ఖాతాను తిరిగి తెరిచి డబ్బులు ఉపసంహరించుకోవాలంటే రూ.5,95,927 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిందితులు కోరారు. ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, లాభాలతో కలిపి ఉపసంహరణ మొత్తం రూ.15 లక్షలు దాటిందని, టీడీఎస్ కింద మరో రూ.5,36,317 చెల్లించాలని ఒత్తిడి చేశారు. అన్ని చెల్లింపులు పూర్తయితే రూ.23,52,931 అందుతాయని నమ్మించారు. పెద్ద మొత్తాన్ని ఉపసంహరించుకునే ఖాతా తెరవాలంటూ మరో రూ.5,36,000 కూడా డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News