Share News

జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 ప్రయోగం నేడు

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:55 AM

అమెరికా జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌ అభివృద్ధి చేస్తున్న నావిక్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడనుంది. నావిగేషన్‌ సేవలందించే ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.

జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 ప్రయోగం నేడు

  • ఎన్‌వీఎస్-03 ఉపగ్రహంతో కక్ష్యలోకి

  • రాత్రి 11.51 గంటలకు ప్రయోగం

సూళ్లూరుపేట, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అమెరికా జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌ అభివృద్ధి చేస్తున్న నావిక్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడనుంది. నావిగేషన్‌ సేవలందించే ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్‌ వి నారాయణన్‌ ఇతర శాస్త్రవేత్తలతో కలిసి సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయం లో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ గురువారం రాత్రి 11.51 గంటలకు ప్రారంభమైంది. ఇది 24 గంటల పాటు కొనసాగిన అనంతరం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. అమెరికా జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌ అభివృద్ధి చేస్తున్న నావిక్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుంది. నావిగేషన్‌ సేవలకు సంబంధించి ఇస్రో ప్రయోగించిన 3 ఉపగ్రహాలు మాత్రమే సేవలందుతున్నాయి. ఈ ఉపగ్రహం ద్వారా భారత్‌తో పాటు సరిహద్దుకు 1,500 కిలోమీటర్ల వరకు మరింత కచ్చితమైన నావిగేషన్‌ సేవలు అందుతాయి.


తిరుమలలో ప్రత్యేక పూజలు

జీఎస్ఎల్వీ-ఎఫ్‌18 రాకెట్‌ నమూనాకు గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌, శాస్త్రవేత్తల బృందం రాకెట్‌ నమూనాతో గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో ఆలయంలోకి వెళ్లారు. గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం నారాయణన్‌ మాట్లాడుతూ... నావిక్‌ సిరీస్‌లో ఇది నాలుగో శాటిలైట్‌ ప్రయోగమన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 12:55 AM