Share News

పనిలో చేరి.. ప్రాణాలు తీస్తున్నారు!

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:00 AM

కేర్‌ టేకర్‌ల ముసుగులో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఉపాధి పేరిట నగరానికి వచ్చి ఏజెన్సీల ద్వారా బడాబాబుల ఇళ్లల్లో పనిమనుషులుగా చేరి నమ్మకంగా నటిస్తూ యజమానుల విశ్వాసాన్ని చూరగొంటున్నారు.

పనిలో చేరి.. ప్రాణాలు తీస్తున్నారు!
Hyderabad Crime

  • కేర్‌టేకర్‌ల ముసుగులో ఘాతుకాలు

  • పనిలో చేరిన కొద్ది రోజులకే దోపిడీలు

  • యజమానుల ఆర్థిక వనరులపై కన్ను

  • హత్యలకు వెనుకాడని అంతర్రాష్ట్ర ముఠాలు

  • రెండేళ్లలో 570 దొంగతనాలు

  • పనిమనుషుల ఎంపికలో అప్రమత్తత అవసరం

  • ఆధార్‌, బయోమెట్రిక్‌ వంటివి తప్పనిసరి

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్‌ అనే మహిళ వద్ద జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పనికి కుదిరారు. ఆమె ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలపై కన్నేశారు. పదిరోజుల్లోనే పథకం పన్ని అదును చూసుకుని ఆమె కాళ్లు, చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. డబ్బు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ కుక్కర్‌తో తలపై మోది, గొంతుకోసి దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

పనిలో చేరిన ఓ వ్యక్తి మరుసటి రోజే 150 తులాల బంగారం, వజ్రాభరణాలతో ఉడాయించాడు. ఎస్‌ఆర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటియజమానులు పనిమీద బయటకు వెళ్లగానే.. అదే అదునుగా భావించి సదరు వ్యక్తి ఇంట్లో ఉన్న వృద్ధుల కళ్లలో కారం చల్లి బంగారు నగలతో పరారయ్యారు.

హైదరాబాద్‌ సిటీ: కేర్‌ టేకర్‌ల ముసుగులో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఉపాధి పేరిట నగరానికి వచ్చి ఏజెన్సీల ద్వారా బడాబాబుల ఇళ్లల్లో పనిమనుషులుగా చేరి నమ్మకంగా నటిస్తూ యజమానుల విశ్వాసాన్ని చూరగొంటున్నారు. వారి ఆర్థిక వనరులన్నీ తెలుసుకుని అదును చూసి దోపిడీలకు పాల్పడుతూ ఉడాయిస్తున్నారు. ఎవరైనా అడ్డువస్తే వారిని హతమార్చేందుకు కూడా వెనకాడడం లేదు.


నగరంలో వీరు గత రెండేళ్లలో 570 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారిలో చాలామంది అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన వారే ఉన్నారు. నగరంలో ఇటువంటి సంఘటనలు తరచూ వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మహానగరానికి నిత్యం ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం వస్తుంటారు. వీరిలో కొందరు భవన నిర్మాణ కార్మికులుగా, ఇళ్లలో పనిచేసే పనివాళ్లుగా, కేర్‌టేకర్లుగా, డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి వారికి విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో, యజమానులు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి పనిలో పెట్టుకుంటున్నారు. అతి తక్కువ జీతానికి వస్తుండడంతో వారికి సంబంధించిన పూర్వ వివరాలేమీ తెలుసుకోకుండానే పనిలో చేర్చుకుంటున్నారు. మరికొందరు ఏలాంటి అనుమతులు లేని ప్రైవేట్‌ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలను ఆశ్రయించి మోసపోతున్నారు.


అయితే, డబ్బుకు కక్కుర్తి పడుతున్న కొన్ని ఏజెన్సీలు.. పనివారి నేరచరిత్రను కనీసం పరిశీలించకుండా కమీషన్ల కోసం ఎవరినైనా ఇళ్లలోకి పంపిస్తున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అంతర్రాష్ట్ర కేటుగాళ్లు అతిమంచితనంగా నటిస్తూ యజమానుల నమ్మకాన్ని చూరగొంటున్నారు. కొద్దిరోజులు గడిచాక అసలు స్వరూపం బయటపెట్టి దోపిడీలు, దొంగతనాలు, చివరకు దారుణ హత్యలకు తెగబడుతున్నారు. ఇటీవల నగరంలో భయభ్రాంతులకు గురిచేసిన ఉదంతాలు కొన్ని ఇలా ఉన్నాయి.


city4.jpg

  • బొల్లారంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో కేవలం 15 రోజులు పనిచేసిన ఒక సెక్యూరిటీ గార్డు పనితీరు నచ్చక సదరు అసోసియేషన్‌ అతన్ని విధుల్లోంచి తప్పించింది. దీంతో కక్ష పెంచుకుని అతను గేటెడ్‌ కమ్యూనిటీలోకి దర్జాగా వెళ్లి ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. అనంతరం హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన నగర ప్రజలను తీవ్ర దిగ్భారంతికి గురిచేసింది.


  • మహారాష్ట్రకు చెందిన రోహన్‌ కాదం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి తెలిసిన వారి సాయంతో సికింద్రాబాద్‌లోని ఓ గోల్డ్‌ రిఫైనరీ (బంగారం శుద్ధిచేసేది) దుకాణంలో పనికి చేరాడు. చేరిన నాలుగో రోజు మెరుగుపెట్టిన 400 గ్రాముల బంగారు ఆభరణాలను జువెల్లరీ షాపులో ఇచ్చి నగదు తీసుకురావాలని యజమాని సూచించాడు. దాంతో రోహన్‌ ఆ బంగారు ఆభరణాలను తీసుకెళ్లి దుకాణంలో ఇచ్చి వారిచ్చిన రూ. 30లక్షలు తీసుకొని ఉడాయించాడు.


  • దోమలగూడలో ఓ ఇంట్లో పనికి చేరిన నేపాల్‌ దొంగలు నెలరోజుల్లోనే ఆ ఇంటి యజమానులకు దగ్గరయ్యారు. కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధులకు మత్తుమందు ఇచ్చి సుమారు రూ. కోటిన్నర విలువైన బంగారం, నగదుతో ఉడాయించారు.

  • జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఇంట్లో పనిచేసిన నేపాలీ పనిమనిషి కల్పన యజమానురాలిని హత్య చేసి నగదు, బంగారంతో పారిపోయిన ఘటన కూడా సంచలనం సృష్టించింది.


పనివాళ్ల ఆధారాలు పక్కాగా తెలుసుకోవాలి

డ్రైవర్లు, పనివాళ్లను ఎంపిక చేసుకునేటప్పుడు ఏజెన్సీలను మాత్రమే నమ్మవద్దు. వీలైనంత వరకు మనకు బాగా తెలిసిన వ్యక్తుల ద్వారానే పనిలో చేర్చుకోవాలి. వారి పక్కా ఆధారాలు తెలుసుకోవాలి. ఆ తర్వాతే వారిని ఎంపిక చేసుకోవాలి. పనివారి ఆధార్‌, రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ వంటి గుర్తింపు కార్డుల కాపీలను తీసుకుని అవి అసలైనవా కాదా అని క్రాస్‌చెక్‌ చేసుకోవాలి. అవసరమైతే వారి వివరాలను స్థానిక పోలీసులకు అందించి, గత నేరచరిత్రపై విచారణ చేయించాలి. దీనివల్ల వారిపై నిఘా ఉండటంతో పాటు నేరస్థులను ముందుగానే గుర్తించవచ్చు. పనివారి కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లతో పాటు వారి బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోవడం చాలా మంచిది. డ్రైవర్లు లేదా పనివాళ్ల ముందు డబ్బులు, లావాదేవీల గురించి మాట్లాడకపోవడమే మంచిది. అలాగే బ్యాంకు పనులు, ఇంటికి సంబంధించిన అత్యంత కీలకమైన బాధ్యతలను వారికి అప్పగించకూడదు.

  • సుమతి, పోలీస్‌ కమిషనర్‌, మల్కాజిగిరి


ఈ వార్తలు కూడా చదవండి:

17న అక్కడక్కడ భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 09:00 AM