నకిలీ ఆస్తి పత్రాలతో రూ.3 కోట్ల రుణం
ABN , Publish Date - May 01 , 2026 | 07:57 AM
నకిలీ ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.3 కోట్ల రుణం పొందిన దంపతులపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు.
దంపతుల అరెస్ట్
హైదరాబాద్ సిటీ: నకిలీ ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.3 కోట్ల రుణం పొందిన దంపతులపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈవోడబ్ల్యూ పీఎస్‌కు బదిలీ చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టలోని ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్రాంచ్‌లో వ్యాపార అవసరాల కోసం బులుసు భాను తేజ, భార్య బి.రామలక్ష్మి 2017 ఏప్రిల్ 18న టర్మ్ లోన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.
అనంతరం సొసైటీ 2017 ఏప్రిల్ 21న వారికి రూ.3 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ రుణాన్ని 84 నెలల్లో 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంది. రుణ భద్రతగా బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లోని షేక్‌పేట్ గ్రామ పరిధిలో ఉన్న 1000 చదరపు గజాల స్థలంతో కూడిన భవనానికి సంబంధించిన అసలు అమ్మకపు పత్రాలను సొసైటీకి సమర్పించారు. ఈ ఆస్తిని రాధాకృష్ణ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించారు. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. అసలు ఆస్తి యజమాని రాధాకృష్ణ 1986 అక్టోబర్ 11న మరణించినట్లు గుర్తించారు. అయినప్పటికీ, 2017లో ఆయన పేరుతో నకిలీ వ్యక్తిని చూపించి అమ్మకపు పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ మేరకు రాధాకృష్ణ వారసులు ఇప్పటికే 2017లో ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అదే సమయంలో రాధాకృష్ణ కుటుంబ సభ్యులు ఆ నకిలీ అమ్మకపు పత్రాలను రద్దు చేస్తూ క్యాన్సిలేషన్ డీడ్ నమోదు చేసి, అనంతరం అదే ఆస్తిని మరో వ్యక్తులకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే రుణగ్రహీతలు సొసైటీకి రుణ బకాయిలు చెల్లించకపోవడంతో 2025 జూన్ 30 నాటికి రూ.5.29 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలతో సొసైటీని మోసం చేసి భారీ రుణం పొందినట్లు బులుసు భాను తేజ, రామలక్ష్మిలపై కేసు నమోదు చేసి ఈవోడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు
జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
Read Latest Telangana News and National News