Share News

మా రహస్య ఆయుధం తీస్తే అమెరికాకు గుండెపోటే!

ABN , Publish Date - May 01 , 2026 | 06:52 AM

అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చల అంశం ఓ కొలిక్కి రాకపోవడం, హోర్ముజ్‌ జలసంధిలో అమెరికా దిగ్బంధం నేపథ్యంలో.. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా, ఇరాన్‌ మధ్య...

మా రహస్య ఆయుధం తీస్తే అమెరికాకు గుండెపోటే!

ఆ ఆయుధం శత్రువులకు దగ్గర్లోనే ఉంది.. పూర్తిగా మా నియంత్రణలోనే హోర్ముజ్‌

  • శత్రువులు దగ్గరికి వస్తే దాడులే..

  • ఇరాన్‌ నేవీ కమాండర్‌ షహ్రామ్‌ ఇరానీ హెచ్చరిక

  • ఆ ఆయుధం ‘హూట్‌’ సూపర్‌ టార్పెడో అనే అంచనాలు

టెహ్రాన్‌/వాషింగ్టన్‌/దుబాయ్‌, ఏప్రిల్‌ 30: అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చల అంశం ఓ కొలిక్కి రాకపోవడం, హోర్ముజ్‌ జలసంధిలో అమెరికా దిగ్బంధం నేపథ్యంలో.. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా, ఇరాన్‌ మధ్య పరస్పర హెచ్చరికలు, సవాళ్లు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ త్వరలోనే తమ శత్రువులు భయపడే ఒక కొత్త రహస్య ఆయుధాన్ని ప్రయోగించబోతోందని ఆ దేశ నౌకాదళ కమాండర్‌ షహ్రామ్‌ ఇరానీ గురువారం పేర్కొన్నారు. ఆ ఆయుధం శత్రువులకు చాలా దగ్గరలోనే ఉందని, ఆ దాడితో శత్రువులకు గుండెపోటు రాకుండా ఉంటుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. హోర్ముజ్‌ జలసంధిని తెరవడంపై ఇరాన్‌ చేసిన ప్రతిపాదనలను ట్రంప్‌ తిరస్కరించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్‌ సామర్థ్యంపై శత్రువులు తప్పుడు అంచనాలు వేసుకున్నారని, ఇప్పుడది ఒక జోక్‌లా మారిపోయిందని షహ్రామ్‌ ఇరానీ పేర్కొన్నారు. తాము అమెరికా యూఎ్‌సఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధ నౌకపై ఏడు సార్లు క్షిపణి దాడులు చేశామని.. దానితో కొంతకాలం పాటు ఆ యుద్ధనౌక ఆపరేషన్లు చేపట్టలేకపోయిందని చెప్పారు. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్‌పై 100 దశలుగా దాడులు చేశామన్నారు. హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని, శత్రువులు ఏమాత్రం దగ్గరగా వచ్చినా వెంటనే దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అమెరికా దిగ్బంధం ఉన్నా కూడా కొన్ని ఇరాన్‌ నౌకలు జలసంధిని దాటాయని ఆయన చెప్పారు.


ఇకపై అమెరికా లేకుండా గల్ఫ్‌ భవిష్యత్తు: మొజ్తాబా ఖమేనీ

దేవుడి దయవల్ల ఇకపై గల్ఫ్‌ భవిష్యత్తు అంతా అమెరికా లేకుండా ఉంటుందని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ వ్యాఖ్యానించారు. పర్షియన్‌ గల్ఫ్‌లో అమెరికా, ఇతర శత్రుదేశాల స్థానం సముద్రపు అడుగున మాత్రమేనని హెచ్చరించారు. ఈ మేరకు మొజ్తాబా ప్రకటనను ఇరాన్‌ అధికారిక టీవీలో యాంకర్‌ బిగ్గరగా చదివి వినిపించారు. ఇరాన్‌ జాతీయ సంపదగా అణు, క్షిపణి సామర్థ్యాలను కాపాడుకుంటామని మొజ్తాబా స్పష్టం చేశారు. ‘‘దేశంలో, విదేశాల్లో ఉన్న 9 కోట్ల మంది ఇరాన్‌ ప్రజలు నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు భద్రంగా కాపాడుకుంటారు. దేవుడి శక్తి, సాయంతో అమెరికా లేకుండా పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. పర్షియన్‌ గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ సముద్ర ప్రాంతాల్లో ఇరుగుపొరుగు దేశాలన్నింటికీ ఒకే విధమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుంచి దురాశతో వచ్చే వారికి ఇక్కడ స్థానం లేదు. వారి స్థానం సముద్రం అడుగునే..’’ అని మొజ్తాబా పేర్కొన్నారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా అవమానకరమైన పరాజయం పొందిందన్నారు. ఇప్పుడీ ప్రాంతంలో కొత్త అధ్యాయం మొదలవబోతోందని చెప్పారు.

యుద్ధం కారణంగా అమెరికా ఖర్చు రూ.2.35 లక్షల కోట్లు!

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు వచ్చే లాభం విషయం అటుంచితే.. ఆ దేశానికి ఖర్చు తడిసి మోపెడవుతోంది. బిలియన్ల కొద్దీ డాలర్లు యుద్ధరం గంలో ఆవిరైపోతున్నాయి. ఇప్పటి వరకు యుద్ధంలో 25 బిలియన్‌ డాలర్ల మేర (భారత కరెన్సీలో సుమా రు రూ.2.35 లక్షల కోట్లు) ఖర్చు అయినట్లు అమెరి కా రక్షణశాఖ సీనియర్‌ అధికారి వెల్లడించారు.


బ్యారెల్‌ చమురు.. 125 డాలర్లు!

  • హోర్ముజ్‌పై అనిశ్చితితో మార్కెట్లో చమురు మంటలు

  • యుద్ధం మొదలైన నాటి నుంచి ఏకంగా 80% మేర పెరిగిన బ్రెంట్‌ క్రూడ్‌

హోర్ముజ్‌ జలసంధి తెరుచుకోవడంపై అనిశ్చితితో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర స్పాట్‌ మార్కెట్లో గురువారం ఏకంగా 6.2శాతం పెరిగి 125.36 డాలర్లకు చేరింది. యుద్ధం మొదలవడానికి ముందున్న 70 డాలర్ల ధరతో పోలిస్తే.. ఇది ఏకంగా 80శాతం అధికం కావడం గమనార్హం. ఇక చమురు ఫ్యూచర్‌ మార్కెట్లో జూలైలో సరఫరా చేయాల్సిన బ్రెంట్‌ క్రూడ్‌ ధర కూడా బ్యారెల్‌కు 113.85 డాలర్లకు చేరింది. అంటే పశ్చిమాసియాలో ఇప్పట్లో పరిస్థితులు చక్కబడేలా లేవని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

0000-National-01-05.jpg

ఆ ఆయుధం.. ‘హూట్‌’ సూపర్‌ టార్పెడోనా?

తాము బయటికి తీసే రహస్య ఆయుధం అమెరికాకు గుండెపోటు తెప్పిస్తుందన్న ఇరాన్‌ హెచ్చరికల నేపథ్యంలో.. ఆ ఆయుధం ‘హూట్‌’ సూపర్‌ టార్పెడో అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే టార్పెడోలు అందరికీ తెలిసిందే. నీటిలో వాటి వేగం గంటకు 60-100 కిలోమీటర్ల మధ్య ఉంటుం ది. అయితే తాము అభివృద్ధి చేసిన ‘హూట్‌’ సూప ర్‌ టార్పెడో వేగం గంటకు 360 కిలోమీటర్ల వేగం తో బుల్లెట్‌లా దూసుకెళ్లి, శత్రువుల నౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేస్తుందని ఇరాన్‌ చెబుతోంది. 2006లో తొలిసారిగా ఈ టార్పెడోను ఇరాన్‌ పరీక్షించింది. హూట్‌ అంటే పర్షియన్‌ భాషలో తిమింగలం అని అర్థం. సాధారణంగా సముద్రాల్లో నీటి ఒత్తిడి, ఘర్షణ కారణంగా టార్పెడోల వేగం పరిమితంగా ఉంటుంది. అదే హూట్‌ టార్పెడో తన చుట్టూ ఒక గాలి బుడగను ఏర్పాటు చేసుకుంటుంది. దానివల్ల నీటి ఘర్షణ తగ్గి.. టార్పెడో వేగంగా దూసుకెళ్లేందుకు వీలవుతుంది. దీనిని సూపర్‌ క్యావిటేషన్‌ అంటారు. ఇంతకుముందు ప్రపంచంలో ఒక్క రష్యా మాత్రమే వీఏ-111 ష్కావల్‌ పేరిట ఈ తరహా ‘సూపర్‌ క్యావిటేషన్‌’ టార్పెడోను అభివృద్ధి చేసింది. రెండో దేశం ఇరాన్‌ కావడం గమనార్హం. 200 కిలోల వార్‌హెడ్‌ ఉన్న హూట్‌ టార్పెడో భారీ పేలుడు సృష్టించగలదు. అయితే దీని పరిధి కేవలం 15 కిలోమీటర్లే. పూర్తిస్థాయిలో రక్షణ ఉండే అమెరికా అబ్ర హం లింకన్‌, గెరాల్డ్‌ ఫోర్డ్‌ వంటి యుద్ధ నౌకలకు అంత దగ్గరగా వెళ్లి ప్రయోగించడం చాలా కష్టం. దానికితోడు టార్పెడోల దాడులను తట్టుకునేలా ఆ నౌకలను నిర్మించారు. ఈ క్రమంలో హూట్‌ టార్పెడోలతో ఏ మేరకు నష్టం కలగనుందనేది ప్రశ్నార్థకమేనని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 06:57 AM