అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:23 PM
తమ భూభాగం మీదుగా ఇరాన్ ఎగుమతులకు పాక్ అనుమతించిందని అమెరికా భద్రతా వ్యవహారాల నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీకుదురుస్తామని చెప్పుకుంటున్న పాక్ తన విశ్వసనీయత కోల్పోయిందా? అమెరికాకు హ్యాండిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా దిగ్బంధనంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్‌కు పాక్ అండగా నిలిచిందని రుజువులతో సహా విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఈ దిశగా యూఎస్ జాతీయ భద్రతా వ్యవహారాల నిపుణుడు డెరెక్ జే గ్రాస్‌మన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
అమెరికా దిగ్బంధనం కారణంగా ఇరాన్ ప్రస్తుతం సముద్రమార్గంలో ముడి చమురు, ఇతర సరకులను ఎగుమతి చేయలేని స్థితిలో పడిపోయింది. ఈ సమస్య నుంచి ఇరాన్‌ను గట్టెక్కించేందుకు పాక్ రంగంలోకి దిగిందని గ్రాస్‌మన్ ఆరోపించారు. ఇరాన్ కంటెయినర్లను తమ భూభాగం మీదుగా తరలించేందుకు పాక్ అనుమతించిందని చెబుతున్నారు. పాక్‌లో మొత్తం ఆరు రహదారుల మీదుగా ఇరాన్ కంటెయినర్ల రవాణాకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ చర్యలతో ట్రంప్ ప్లాన్‌లకు గండిపడినట్టేనని గ్రాస్‌మన్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
పాక్‌లోని మొత్తం ఆరు రహదారుల మీదుగా ఇరాన్ తన సరకును రష్యాతో పాటు ఇతర దేశాలకు తరలించేందుకు పాక్ అనుమతించిందని గ్రాస్‌మన్ చెప్పారు. దీంతో, అమెరికా ఒత్తిడిని తట్టుకుని నిలిచే అవకాశం ఇరాన్‌కు చిక్కినట్టైందని అన్నారు. చర్చల్లో పాక్ తటస్థంగా ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేసింది. పాక్‌ను నమ్మలేమని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గ్రాస్‌మన్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..
కోహినూర్‌ను భారత్‌కు తిరిగివ్వాలని బ్రిటన్ రాజును కోరుతా: న్యూయార్క్ మేయర్ మమ్దానీ