పాలు లేకుండానే నెయ్యి
ABN , Publish Date - Aug 19 , 2026 | 09:38 AM
ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.
స్కిమ్ మిల్క్ పొడి, పామాయిల్, సువాసన ‘రసాయనాల’తో తయారీ
ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హెచ్-ఫాస్ట్ పోలీసుల దాడులు
36 టన్నుల కల్తీ నెయ్యి, రసాయనాలు స్వాధీనం
నివేదికల ఆధారంగా కేసుల నమోదు.. చట్టపరంగా చర్యలు
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్
హెచ్-ఫాస్టు పోలీసులకు సీపీ అభినందన, రివార్డులు
హైదరాబాద్ సిటీ: ఆవు లేదా గేదె పాలతో వెన్న.. దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. కానీ పాలు లేకుండా పామాయిల్, వనస్పతి (డాల్డా), రసాయనాలు ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇటీవల భారీ ఎత్తున కల్తీ మసాలాలను పట్టుకున్న హెచ్-ఫాస్టు పోలీసులు, ఆహార భద్రతా విభాగం సంయుక్తంగా భారీ ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్‌లోని 39 కల్తీ తయారీ కేంద్రాలు, 91 విక్రయ దుకాణాల (130 ప్రాంగణాలు)పై సంయుక్తంగా దాడులు చేసి 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
అందులో 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, మూడు రకాల సువాసన బాటిళ్లు ఆరు, రవ్వతోపాటు పిండి 30 కిలోలు ఉన్నాయి. జప్తు చేసిన వస్తువులను టెస్టింగ్ కోసం ల్యాబ్‌లకు, ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించినట్లు మంగళవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ విజయ్‌కుమార్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇలా కల్తీ నెయ్యి తయారీ
కల్తీ నెయ్యి తయారీ దారులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మిల్క్ క్రీమ్ తెప్పిస్తున్నారు. పాలు లేకుండా జీరో ఫ్యాట్ కల స్కిమ్డ్ మిల్క్ పౌడర్, పామాయిల్, వనస్పతి, స్టార్చ్, సువాసనలు వెదజల్లే రసాయనాల (పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ ఆయిల్‌కు బీటా-కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనో గ్లిజరైడ్స్) ను తగిన మోతాదులో కలిపి నెయ్యిని సృష్టిస్తున్నారు. లేబులింగ్ నిబంధనలను తోసిరాజని.. ఎఫ్‌ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబరు, బ్యాచ్ నంబరు,
తయారీ/ ఎక్స్‌పైరీ తేదీల్లేకుండానే.. ‘100శాతం ప్యూర్ నెయ్యి’, ‘ప్రీమియం నెయ్యి’, ‘ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి’, ‘నేచురల్ నెయ్యి’ అనే పేర్లతో మార్కెట్‌లోకి పంపుతున్నారు. 10-40శాతం వరకు కల్తీ చేసి.. నాణ్యత ఆధారంగా ఆయా వర్గాల అవసరాలను బట్టి వేర్వేరు రకాలుగా నెయ్యి తయారు చేసి పంపుతున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు.. పొరుగు రాష్ర్టాలకు కూడా ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నారు. కల్తీ నెయ్యి తయారీదారులు, విక్రేతలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని, నివేదికల ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు.
ప్రజా భాగస్వామ్యంతోనే అడ్డుకట్ట
కల్తీ ఆహారంలో పోరాటంలో ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని సజ్జనార్ వెల్లడించారు. ఆయా ప్యాకెట్లపై ఎఫ్‌ఎస్ఎస్ఏఐ లైసెన్సు వివరాలు ఉన్నాయేమో గమనించాలన్నారు. మీప్రాంతంలో కల్తీ నెయ్యి, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తుంటే ఎమర్జెన్సీ నంబర్ 112కు గానీ, హెచ్-ఫా్‌స్ట హెల్ప్‌లైన్ నంబర్ 8712661212 కు గాని సమాచారం అందించాలన్న సజ్జనార్.. వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామన్నారు. ఈ స్పెషల్ ఆపరేషన్‌లో భారీగా కల్తీ నెయ్యి తయారీ గుట్టును రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, హెచ్ ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎమ్. అంజయ్య, సబ్‌ఇన్‌స్పెక్టర్లు రమ్య, అభిలాష్, శంకర్, కృష్ణ, అఖిల్, ఇతర సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.
రసాయనాలతో తలెత్తే ఆరోగ్య సమస్యలు
అక్రమార్కులు ల్యాబ్ పరీక్షల్లో దొరక్కుకుండా రసాయనాలను కలిపి జాగ్రత్త పడుతున్నారు. వీటివల్ల చెడు కొలెస్ట్రాల్, గుండెజబ్బు, పక్షవాతం, హృద్రోగ/ జీర్ణక్రియ సమస్యలతోపాటు కాలేయం, మూత్ర పిండాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చర్మ అలర్జీలతోపాటు, దీర్ఘకాలిక జీవ క్రియ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ..
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News