Share News

10 నెలల్లో రూ.205.18 కోట్లు..సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన సొమ్ము ఇదీ

ABN , Publish Date - Oct 28 , 2026 | 07:39 AM

సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి నగరవాసులు ఆర్థికంగా చితికిపోతున్నారు. అత్యాశ, భయం, అప్రమత్తత లోపించడాన్నే పెట్టుబడిగా చేసుకొని కేటుగాళ్లు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు.

10 నెలల్లో  రూ.205.18 కోట్లు..సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన సొమ్ము ఇదీ
cyber criminals

  • కేవలం సైబరాబాద్‌ పరిధిలోనే..

  • ట్రేడింగ్‌ మోసాల్లోనే రూ. 129 కోట్లు లూటీ

  • సీసీపీఎస్‌ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి నగరవాసులు ఆర్థికంగా చితికిపోతున్నారు. అత్యాశ, భయం, అప్రమత్తత లోపించడాన్నే పెట్టుబడిగా చేసుకొని కేటుగాళ్లు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ ఏడాది అక్టోబరు 22 నాటికి కేవలం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి సైబర్‌ క్రైం పోలీ్‌సస్టేషన్‌ (సీసీపీఎస్‌) పరిధిలో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. ఇప్పటివరకు మొత్తం 1,412 కేసులు నమోదు కాగా, బాధితులు 10 నెలల కాలంలోనే రూ. 205.18 కోట్లకు పైగా నష్టపోయినట్లు సైబర్‌ క్రైం పోలీసు విభాగం అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


అగ్రస్థానంలో ట్రేడింగ్‌ మోసాలు

అతి తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయంటూ నేరగాళ్లు భారీగా దోచేస్తున్నారు. సైబరాబాద్‌లో నమోదైన మొత్తం నేరాల్లో ట్రేడింగ్‌ మోసాలే సింహభాగం ఆక్రమించాయి. కేవలం ఈ ఒక్క విభాగంలోనే 442 కేసులు నమోదు కాగా, బాధితుల నుంచి ఏకంగా రూ.129.27 కోట్లను కాజేశారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో..

ఇంట్లో కూర్చునే సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ‘పార్ట్‌ టైమ్‌ జాబ్‌’ల పేరిట 198 మందిని బురిడీ కొట్టించి రూ.14.14 కోట్లకు పైగా కొల్లగొట్టారు. మొబైల్‌ మెసేజ్‌ల ద్వారా లింకులు పంపి వలవేసే ‘స్మిషింగ్‌’ తరహాలో 196 కేసులు నమోదై రూ.6.99 కోట్లు పోయాయి. అలాగే ‘ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌ 1.0’ కింద పోలీసులు 105 కేసులను గుర్తించారు.


city2.2.jpgడిజిటల్‌ అరెస్టులతో రూ.12.12 కోట్లు

ఇటీవల కాలంలో ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న ‘డిజిటల్‌ అరెస్ట్‌’ మోసాలు సైతం భారీ నష్టాన్ని మిగిల్చాయి. సీబీఐ, ఈడీ, పోలీసు అధికారులమంటూ 31 కేసుల్లో నేరగాళ్లు రూ.12.12 కోట్లు కొట్టేశారు.

ఆ లింకులను క్లిక్‌ చేయొద్దు

అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్‌ చేయొద్దని, అధిక లాభాల పేరుతో వచ్చే వాట్సాప్‌, టెలిగ్రామ్‌ సందేశాలను నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే జాప్యం చేయకుండా టోల్‌ఫ్రీ నంబర్‌ 1930 లేదా నేషనల్‌ సైబర్‌ క్రైం పోర్టల్‌ను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.


వివిధ విభాగాల్లో మోసాల తీరు ఇలా..

  • లోన్‌ ఫ్రాడ్‌: తక్కువ వడ్డీకే రుణాలంటూ 40 కేసుల్లో రూ.7.12 కోట్లు దోచేశారు.

  • క్రిప్టో ఫ్రాడ్‌: క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరిట 19 కేసుల్లో రూ. 7.03 కోట్లు

  • నకిలీ వేషధారణ (ఇంపర్సనేషన్‌): 33 కేసుల్లో రూ. 4.81 కోట్లకు పైగా

  • ఉద్యోగ మోసాలు: 56 కేసులకు గాను రూ. 4.26 కోట్లు, విషింగ్‌ (ఫోన్‌ కాల్స్‌) ద్వారా 86 కేసుల్లో రూ. 3.05 కోట్లు కొల్లగొట్టారు.

  • ఇతర మోసాల్లో అడ్వర్టైజ్‌మెంట్‌ పేరుతో రూ.2.72 కోట్లు, హ్యాకింగ్‌ ద్వారా రూ.1.17 కోట్లు, లోన్‌ వేధింపుల కేసుల్లో రూ.51.33 లక్షలు బాధితులు నష్టపోయారు. వీటితో పాటు ఫేక్‌ కస్టమర్‌ కేర్‌, లాటరీ, ఫిషింగ్‌, గిఫ్ట్‌ ఫ్రాడ్ల ద్వారా కూడా భారీ మొత్తంలో నగదు చేతులు మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11 గంటల నుంచి కరెంట్ కట్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 07:43 AM