ప్రజల సొమ్ముతో నాయక్ విలాసాలు..
ABN , Publish Date - Nov 10 , 2026 | 09:31 AM
అధిక వడ్డీ ఆశ చూపి వేలాది మంది నుంచి వందల కోట్ల రూపాయలు సేకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నానావత్ భూపాల్ నాయక్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.
నెలకు 4 శాతం రాబడి ఆశచూపి వల
7వేల మంది నుంచి భారీగా నిధుల సేకరణ
ప్రజాప్రతినిధి కావాలనే ఆశలు!
రాజకీయాల్లోకి రావాలనే యోచన
సైబరాబాద్ పోలీసుల ఈఓడబ్ల్యూ దర్యాప్తులో వెలుగులోకి..
ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం కోర్టుకు పోలీసులు
హైదరాబాద్ సిటీ: అధిక వడ్డీ ఆశ చూపి వేలాది మంది నుంచి వందల కోట్ల రూపాయలు సేకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నానావత్ భూపాల్ నాయక్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ప్రజల కష్టార్జితాన్ని పెట్టుబడుల రూపంలో సమీకరించి, ఆ సొమ్ముతో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రజాప్రతినిధిగా ఎదగాలనే ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సైబరాబాద్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) చేపట్టిన దర్యాప్తులో వెలుగుచూస్తున్న తాజా అంశాలు పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దర్యాప్తులో గుర్తించిన ఆస్తులను అటాచ్ చేసేందుకు కోర్టుకు నివేదించడంతో పాటు ప్రభుత్వానికి లేఖ రాశారు.
దీనికి సంబంధించి జీవో రావాల్సి ఉందని దర్యాప్తు అధికారి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌బీపీఎల్), కిసాన్ పరివార్ లిమిటెడ్ (కేపీఎల్) సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 7వేల మంది నుంచి రూ.670 కోట్ల మేర నిధులు సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులపై నెలకు నాలుగు శాతం వరకు రాబడి అందిస్తామని నిందితులు ప్రచారం చేసి భారీగా నిధులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కిసాన్ పరివార్ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ భూముల్లో పెట్టుబడుల పేరుతోనూ నిధులు సమీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చిన్నస్థాయి నుంచి వందల కోట్ల వ్యాపారం వరకు..
భూపాల్ నాయక్ ప్రస్థానం తొలుత హైదరాబాద్‌లో తండ్రితో కలిసి భవన నిర్మాణ పనులు చేసిన ఆయన, అనంతరం పెట్రోల్ బంకులో ఆ తర్వాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థలో ఏజెంట్‌గా చేరి, చివరకు షేర్స్ బజార్ సంస్థ కార్యకలాపాలతో భారీగా పెట్టుబడులు సమీకరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇప్పటివరకు 70 బ్యాంకు ఖాతాలను, 46 ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. అలాగే పలు జిల్లాల్లో సుమారు 140 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు వాణిజ్య ఆస్తులు, ఒక విల్లాను గుర్తించినట్లు తెలిసింది.
ఐదుగురి అరెస్టు..
ఈ వ్యవహారంలో భూపాల్ నాయక్ సహా ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో నేనావత్ బాబు నాయక్, రాంబాబు దంతు, ఎన్.ఎ్‌స.శంకర్ రావు, సంతోష్ కుమార్‌లు ఉన్నారు. తెలంగాణలో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పరిధిలో మూడు కేసులు నమోదవగా, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరో ఐదు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో సాధారణ పెట్టుబడిదారులతో పాటు రిటైర్డ్ సైనికాధికారుల కుటుంబాలు కూడా బాధితులుగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
‘నామినేటెడ్’పై కుదరని ఏకాభిప్రాయం?
Read Latest AP News And Telangana News And International News And Telugu News