ఏనుగును వేధించిన యువకులు.. తోక పట్టుకుని లాగుతూ వికృత చేష్టలు..
ABN , Publish Date - Nov 10 , 2026 | 08:21 AM
సాధారణంగా పెద్దపెద్ద అడవి జంతువులంటే మనుషులు చాలా భయపడుతుంటారు. ఇక సింహం, పులి, ఏనుగు వంటివి ఎదురుపడితే అంతే సంగతులు. అలాంటిది కొందరు యువకులు ఏకంగా అడవి ఏనుగు దగ్గరకు వెళ్లి ఆటపట్టించేందుకు ప్రయత్నించారు.
భువనేశ్వర్, నవంబర్ 10: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ప్రయత్నమో.. సరదా కోసమో తెలియదు కానీ, కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా అడవి జంతువులంటే మనుషులు చాలా భయపడుతుంటారు. ఇక సింహం, పులి, ఏనుగు వంటివి ఎదురుపడితే అంతే సంగతులు. అలాంటిది కొందరు యువకులు ఏకంగా అడవి ఏనుగు దగ్గరకు వెళ్లి ఆటపట్టించేందుకు ప్రయత్నించారు. దాని తోకను పట్టుకుని లాగడం, తొండాన్ని తాకుతూ చిరాకు తెప్పించడం వంటి పనులు చేశారు. ప్రస్తుతం రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఒడిశాలోని ధెంకనాల్ జిల్లా హిందోల్ అటవీ ప్రాంతంలోని దెంగబొయిరై, పటాలా గ్రామాల సమీపంలో కొన్ని నెలలుగా ఓ ఏనుగు సంచరిస్తోంది. స్థానికులు దానిని 'టుంగురు' అని పిలుస్తున్నారు. అది గ్రామాల పరిసరాలతో పాటు పాఠశాల ప్రాంగణాల వరకూ వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎవరికీ హాని చేయకుండా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, కొంతమంది యువకులు దానిని పదేపదే రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
వైరల్ అవుతున్న ఓ వీడియోలో యువకుడు ఏనుగుకు అత్యంత సమీపంగా వెళ్లడం కనిపిస్తోంది. చెట్టు చుట్టూ తిరుగుతూ టుంగురు తొండాన్ని, తోకను తాకుతూ ఆటపట్టించాడు. గజరాజుకు తీవ్రంగా కోపం తెప్పించేలా ప్రవర్తించాడు. మరో వీడియోలోనూ ఓ యువకుడు టుంగురు తోకను లాగుతూ దానికి చిరాకు తెప్పించే ప్రయత్నం చేశాడు. దాని వెనుకే వెళ్తూ పదేపదే తోక లాగి ఇబ్బందికి గురిచేశాడు. ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
అయితే, ఈ రెండు ఘటనల్లోనూ ఆ ఏనుగు ఎవరికీ హాని చేయలేదు. యువకులు ఎంత రెచ్చగొట్టినా టుంగురు మాత్రం సహనం కోల్పోలేదు. ఈ వీడియోలను చూసిన స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో దాడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఆ యువకులపై నెటిజన్లు మండిపడుతున్నారు. మూగజీవాలను వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోవా మంద్రెమ్ బీచ్లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. వీడియో వైరల్
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..