Share News

హోసూరు టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. ముగ్గురు కార్మికుల మృతి

ABN , Publish Date - Nov 10 , 2026 | 09:04 AM

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషవాయువు పీల్చి ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు మృతిచెందారు.

హోసూరు టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. ముగ్గురు కార్మికుల మృతి
Tata Electronics Hosur Plant

చెన్నై: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషవాయువు పీల్చి ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు మృతిచెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.


టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన మేరీగోల్డ్ ప్లాంట్‌లోని వ్యర్థ జలాల నిల్వ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ముగ్గురు కార్మికులు వెళ్లారు. ఈ క్రమంలో ట్యాంక్ నుంచి వెలువడిన విషవాయువును పీల్చడంతో తొలుత అక్మల్ బాబు భాయ్ (28) అస్వస్థతకు గురై ట్యాంకులో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన శరత్ కుమార్ (25) కూడా విషవాయువు పీల్చి ట్యాంకులో పడిపోయాడు. దీంతో కావేరి (31) ప్లాంట్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. అయితే, ఆ తర్వాత ఆమె కూడా విషవాయువు ప్రభావానికి గురై ట్యాంకులో పడిపోయింది. దీంతో ముగ్గురినీ ఫ్యాక్టరీ భద్రతా సిబ్బంది బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ముగ్గురూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


కాగా, మృతిచెందిన కార్మికులు ధర్మపురి జిల్లాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. వీరు నెల్కో అనే కాంట్రాక్టు సంస్థ ద్వారా ప్లాంట్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై రాయక్కోటై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ట్యాంక్‌లోకి కార్మికులను పంపించే ముందు అవసరమైన భద్రతా పరికరాలు అందించారా?, ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు, ఒకేసారి ముగ్గురు కార్మికుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఏనుగును వేధించిన యువకులు.. తోక పట్టుకుని లాగుతూ వికృత చేష్టలు..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

Updated Date - Nov 10 , 2026 | 09:05 AM