‘నామినేటెడ్’పై కుదరని ఏకాభిప్రాయం?
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:43 AM
‘నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ!’’.. అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ప్రకటించడం.. ఆ తర్వాత వాయిదా పడడం.. కొన్ని నెలలుగా ఇదే తంతు సాగుతోంది.
12న లేదా 19న ప్రకటన అంటూ కొత్త ప్రచారం
రెన్యూవల్ ఆరుగురికే..
కొత్త వారికి అవకాశాలు
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ!’’.. అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ప్రకటించడం.. ఆ తర్వాత వాయిదా పడడం.. కొన్ని నెలలుగా ఇదే తంతు సాగుతోంది. ఎప్పటికప్పుడు నియామకాలు వాయిదా పడుతుండడంతో ఆశావహులు ఉసూరుమంటున్నారు. నియామకాలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఏకాభిప్రాయం రాకపోవడమే ఈ జాప్యానికి కారణమన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ కార్పొరేషన్లు, కమిషన్లకు ప్రస్తుతం చైర్మన్లు, సభ్యులు లేరు. 2024లో నియామకాలు జరిగిన కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యుల పదవీ కాలం జూలై, ఆగస్టు నెలల్లో ముగియగా, అప్పటి నుంచి అవీ ఖాళీగా ఉన్నాయి. మరి కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఇంత వరకూ నియామకాలే జరగలేదు. వాస్తవానికి నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీకి, ప్రభుత్వానికి ఏకాభిప్రాయం కుదరడమే కీలకమన్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో సీఎం, టీపీసీసీ చీఫ్‌తో పాటుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కీలకంగా ఉంటారు. అయితే, లండన్ వర్శిటీలో అర్థశాస్త్రంలో కోర్సు చేస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ప్రస్తుతం అందుబాటులో లేరు. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మధ్య అడపాదడపా జరిగిన చర్చల్లో 15 వరకూ కార్పొరేషన్లు, కమిషన్ల చైర్మన్లు, సభ్యులపైన ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది.
మిగతా వాటికి సంబంధించిన చర్చలు ఆలస్యం కావడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి వద్ద భేటీ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో హెచ్‌ఐసీసీలో జరిగే భారత్ సమ్మిట్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలను నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే వారి పర్యటన షెడ్యూల్ ఇప్పటిదాకా ఖరారు కాలేదు. వారిలో ఎవరు వచ్చినా.. సమ్మిట్ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ వారు రాని పక్షంలో భారత్ సమ్మిట్‌కు ముందు చర్చలు ఉంటాయని నేతలు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ నెల 12న లేదా ఇందిర జయంతి అయిన 19న నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం నడుస్తోంది. ఏకాభిప్రాయం రాకుంటే ఈ జాప్యం స్థానిక ఎన్నికల దాకా వెళ్లవచ్చనీ చెబుతున్నారు. కాగా, ఈ దఫా పాతవారిలో ఆరుగురికి మించి రెన్యూవల్ ఉండబోదన్న వాదన వినిపిస్తోంది. ఈ జాబితాలో నిర్మలా జగ్గారెడ్డి, ప్రీతమ్, బెల్లయ్యనాయక్, శివేనారెడ్డి.. మరో ఇద్దరు ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీలో కొత్తవారికి పెద్ద ఎత్తున అవకాశాలు దక్కే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.