శ్రీకాకుళంలో కదులుతున్న రైలు నుంచి కిందపడిన యువతి మృతదేహం
ABN , Publish Date - Oct 09 , 2026 | 10:39 AM
కదులుతున్న రైలు నుంచి ఓ యువతి మృతదేహం కిందపడడం కలకలం రేపింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని దూసి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం, అక్టోబర్ 9: జిల్లాలోని దూసి రైల్వేస్టేషన్ పరిధిలో పొందూరు సమీపంలో కదులుతున్న రైలు నుంచి ఓ యువతి మృతదేహం కిందపడింది. పోలీసుల దర్యాప్తులో మృతురాలు అసోంకు చెందిన హిమశ్రీ బోరోగా తేలింది. వివరాల్లోకి వెళితే..
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్ శ్రీకాకుళం మీదుగా ప్రయాణిస్తుంది. అయితే.. కన్యాకుమారి నుంచి దిబ్రుఘర్‌కు బయలుదేరిన వివేక్ ఎక్స్‌ప్రెస్ శ్రీకాకుళంలోని దూసి రైల్వే స్టేషన్ పరిధిలోని పొందూరుకు చేరుకోగానే.. ఓ యువతి మృతదేహం రైలు నుంచి కింద పడింది. గమనించిన స్థానికులు పొందూరు పోలీసులకు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మృతదేహం అసోంకు చెందిన హిమశ్రీ బోరోదిగా పోలీసులు గుర్తించారు.
అసోంకు చెందిన ముప్పై మందితో కూడుకున్న ఓ బృందం గణేష్ నిమజ్జనం సందర్భంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు విశాఖపట్టణానికి నెల రోజుల క్రితం వచ్చింది. హిమశ్రీ కూడా ఈ బృందంలోని సభ్యురాలుగా పోలీసులు గుర్తించారు. హిమశ్రీకి బ్యాంక్ కాంపిటీటివ్ పరీక్ష ఉన్నందున.. అసోంకు బయలుదేరింది. హిమశ్రీ ముందుగా చేసుకున్న రిజర్వేషన్ టిక్కెట్ రద్దు కావడంతో వివేక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. అయితే.. హిమశ్రీ ఎక్కిన ఎస్2 బోగీలో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిందా.. లేదంటే వెనుక నుంచి ఎవరైనా తోసేసారా.. ఆమె మృతి వెనుక ఇతర కారణాలున్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట
దసరా రద్దీతో రైళ్లన్నీ ఫుల్.. వెయిటింగ్ లిస్టు కష్టమే
Read Latest AP News And Telangana News