Sankranti Bus Fares: పండుగ పేరుతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:03 AM
సాధారణంగా తిరుగు ప్రయాణంలో చార్జీల మోత ఉంటుంది. ఈసారి ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం, వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లు నడవకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్ల వంట అ౦డింది. స్పెషల్ పేరుతో అయిన కాడికి దోచేస్తున్నారు.
» ఇప్పటికే రైళ్లు, రెగ్యులర్ బస్సులు ఫుల్
» డిమాండ్ బట్టి రెండు రెట్లు పెంపు
» హైదరాబాద్ నుంచి ఏలూరుకు రూ.3వేలు పైనే.. నిబంధనలు బేఖాతర్
» పట్టించుకోని అధికారులు
సంక్రాంతి (Sankranti) పండుగ డిమాండ్‌ను వేట్ ఆపరేటర్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఫుల్ అయ్యాయి. దీంతో ప్రైవేటు బస్ ఛార్జీలను రెండు నుంచి మూడు రెట్లు పెంచేశారు. వీటిని శుక్రవారం నుంచే అమలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చే ప్రయాణికులు పెరిగిన ధరలను చూసి నీళ్లు నములుతున్నారు.
ఏలూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా తిరుగు ప్రయాణంలో చార్జీల మోత (Sankranti Bus Fares) ఉంటుంది. ఈసారి ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం, వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లు నడవకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్ల వంట అ౦డింది. స్పెషల్ పేరుతో అయిన కాడికి దోచేస్తున్నారు. సాధారణ రోజుల్లో నరసాపురం నుంచి స్లీపర్ ధర రూ.1,500, సీటు రూ.700 ఉంటుంది. స్పెషల్స్ పేరిట ఆపరేటర్లు ఏసీ బస్సు స్లీపర్‌కు రూ.3వేల నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. సీటు అయితే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు దోచుకుంటున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు ప్రాంతాలకు దాదాపు కాస్త అటూ ఇటూగా టిక్కెట్ ధరలకు వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు తదితర ప్రాంతాలకు లగ్జరీ ప్రైవేటు బస్సు టిక్కెట్ ధర రూ.1000 నుంచి రూ.1200లోపు ఉండగా పండుగ సీజన్లో రూ.2,500 నుంచి 3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఓ కుటుంబంలో నలుగురు పండుగకు ఊరు వెళ్లాలంటే కేవలం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టికెట్లకే రూ.12,000 అవుతుంది. పండుగ వేడుక పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలోను ఇంతే మొత్తం వెచ్చించాలి. ఈ దందాపై రవాణా యంత్రాంగం దృష్టి సారించడం లేదా..? అంటే సమాధానం కష్టమే. మోటారు వాహన చట్టాల్లోని నిబంధనలు నిలువునా ఉల్లంఘించినా పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లో ఈ ధరలు పలుకుతున్నాయి. తిరుగు ప్రయాణ టిక్కెట్లను అప్పుడే తెరవలేదు. వాటిని డిమాండ్‌ను బట్టి అమ్ముకునేందుకు సిద్ధం అవుతున్నారు. అడ్డగోలుగా ప్రైవేట్ ఆపరేటర్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచేసినా రవాణ శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉమ్మడి పశ్చిమలో ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాలకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనే స్పెషల్ బస్సులను నడుపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై నిఘా
ఏలూరు క్రైం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా మీదుగా నడుస్తున్న కాంట్రాక్టు క్యారేజ్ బస్సుల తనిఖీలకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్టు ఇన్‌చార్జ్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కేఎస్ఎంవీ కృష్ణారావు తెలిపారు. సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టు క్యారేజ్ బస్సుల తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్టీవోలు ఎస్బీ శేఖర్. ఎస్. రంగనాయకులు ఆధ్వర్యంలో మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏలూరు సమీపంలోని కలపర్రు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఈనెల 19వ తేదీ వరకూ తనిఖీలు కొనసాగుతాయన్నారు. టిక్కెట్‌కు అధిక ధరలు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బస్సుల్లో అగ్ని ప్రమాద రక్షణ పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు తప్పకుండా ఉండాలని, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఏర్పాటు తదితర జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫిటినెస్, ఇన్సూరెన్సు అన్ని పత్రాలు ఉన్న బస్సులను మాత్రమే నడపాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News