ఏలూరు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం.. రెండు దూడలపై దాడి
ABN , Publish Date - Jan 31 , 2026 | 10:43 AM
ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం వద్ద పెద్దపులి సంచారం మొదలైంది. ఈ పులి రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. దీంతో ఇటుకల కోట ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనను గురవుతున్నారు.
ఏలూరు జిల్లా, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం(Tiger Attack) స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం మండల పరిసర ప్రాంతంలో పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంత సరిహద్దుల్లో సంచరిస్తున్న పులి.. తాజగా ఇటుకలకోట గ్రామం వద్ద జనావాసాల్లో ప్రవేశించి ఆరుబయట కట్టేసి ఉన్న రెండు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. దీంతో పశువుల కాపరులు, దూడల మృతదేహాలను చూసి షాక్‌కు గురయ్యారు. పులి దాడిచేసిన తీరును బట్టి.. దానిని పెద్దపులిగా భావిస్తున్నారు స్థానికులు.
రంగంలోకి దిగిన అటవీ శాఖ..
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న పులి పాదముద్రలను అధికారులు సేకరించారు. పులి సంచారాన్ని కనిపెట్టడానికి అవసరమైన చోట్ల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటుకలకోట, పరిసర గ్రామస్థులు రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్దకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
వరుసగా పశువులపై దాడులు..
వరుసగా పశువులపై దాడులు జరుగుతుండటంతో రైతులు తమ పశుసంపదను కాపాడుకోవడానికి భయపడుతున్నారు. రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా తిరగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ సిబ్బంది వెంటనే స్పందించి.. పులిని బంధించాలని లేదా అడవిలోకి తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ దొంగతనం చూస్తే విస్తుపోవాల్సిందే.. కేవలం 15 సెకన్లలోనే..
బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News