ఏలూరు జిల్లాలో ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురి మృతి
ABN , Publish Date - Jul 05 , 2026 | 08:17 AM
ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
ఏలూరు జిల్లా, జులై 5 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు నలుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతిచెందారు. రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మృతుల వివరాలు గుర్తించడానికి రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఒక మృతదేహం వద్ద షేక్ హసీనా పేరుతో ఉన్న ఏటీఎం కార్డు లభించగా, మరో మృతదేహం వద్ద ఆర్టీసీ పార్కింగ్ పాస్ స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మృతుల వివరాలను గుర్తించే పనిని పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఆత్మహత్యకు సంబంధించినదా అనే అన్ని కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ దగ్గరకు వారు ఎలా వచ్చారు? ఈ ప్రమాదానికి ముందు మృతుల పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News