Share News

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్..

ABN , Publish Date - Mar 04 , 2026 | 09:28 AM

ఎస్.కోటకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మీతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారా? అంటూ ఔనైతే ఒకటి, కాదయితే రెండు నొక్కండంటూ చెప్పింది. ఆయన జవాబు ఇవ్వకపోవడంతో మళ్లీ రింగ్‌యింది.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై  ప్రభుత్వం స్పెషల్ ఫోకస్..
Sub Registrar Office

  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై ప్రభుత్వం లోతుగా ఆరా

  • ఐవీఆర్ఎస్ ద్వారా వివరాల సేకరణ

  • అధికారులు, ఉద్యోగుల ప్రవర్తనపైనా కన్ను

  • అనధికార చెల్లింపులకు పాల్పడుతున్నారా అంటూ ప్రశ్న

శృంగవరపుకోట, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఎస్.కోటకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Sub Registrar Office) పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మీతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారా? అంటూ ఔనైతే ఒకటి, కాదయితే రెండు నొక్కండంటూ చెప్పింది. ఆయన జవాబు ఇవ్వకపోవడంతో మళ్లీ రింగ్‌యింది. ఈసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనధికార చెల్లింపులకు పాల్పడుతున్నారా? ఔను అయితే ఒకటి, కాదయితే రెండు నొక్కండంటూ చెప్పింది.. ఇలా ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో ప్రజలు చెప్పే సమాధానాలు బట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రక్షాళన చేయనుంది.


కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుతోపాటు ప్రభుత్వ కార్యాలయాల పని తీరునూ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తెలుసుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రతి నెల ఏదో ఒక కార్యాలయ పనితీరు గురించి ఆరా తీస్తోంది. ప్రధానంగా రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై నిఘా పెట్టింది. వీటిపైనే ఎక్కువగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి.

జిల్లాలో ఇటీవల భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగులతో పాటు ఓ అనాధికార వ్యక్తి ఇంట్లో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే మండలంలో ఓ గ్రామానికి చెందిన ఇన్‌చార్జి గ్రామ రెవెన్యూ అధికారి వారం రోజుల క్రితం రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి కూడా విదితమే. దీంతో ఈ రెండు శాఖలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబునాయుడు రెవెన్యూ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు అడుగులు వేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను సరిదిద్దే పనిలో పడ్డారు. కాగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణ ఉంది.


అదే తీరు..

కాగా గత వైసీపీ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములను చట్టబద్ధం చేసింది. భూ యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ జరిగిన భూములకు రిజిస్ట్రేషన్లు అధికంగా జరగడంతో కూటమి ప్రభుత్వం వాటిపై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అప్పటి భూ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నట్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూర్చీలు, టేబుల్స్ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటికీ ఆ వైపుగా చర్యలు చేపట్టలేదు. నిలబెట్టి సంతకాలు చేయిస్తున్నారు. సంతకాలు చేయిస్తున్నవారు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది కాకుండా రైటర్‌లకు కార్యాలయ అధికారులకు మధ్యవర్తిత్వం వహించే వ్యక్తులు కావడం గమనార్హం.


రైటర్లే అంతా..

జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చేవారికి కనీస గౌరవం ఇవ్వడం లేదు. మర్యాదగా మాట్లాడటం లేదు. క్రయ, విక్రయదారులు చెప్పేమాటలేవీ వినిపించుకోవడం లేదు. డాక్యుమెంట్ రైటర్లను అనుసరిస్తేనే పని అవుతోంది. వీరి సహకారం లేకుండా భూ క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు జరగడం రైతుల తరం కావడం లేదు. డాక్యుమెంటు తయారు చేసి వీరు తీసుకెళ్లిన తర్వాతే రిజిస్ట్రేషన్లకు సమ్మతిస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో ఎక్కువ మంది ప్రజలు ఇచ్చిన సమాధానాలను బట్టి ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనితీరును అంచనా వేయనుంది. రైతులు నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం రుసుం చెల్లింపులు జరిగేలా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులందరినీ గౌరవంగా చూసేలా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి..


ఈ వార్తలు కూడా చదవండి..

వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 09:54 AM