Share News

ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్

ABN , Publish Date - Jun 22 , 2026 | 08:12 AM

విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో నగ్నచిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు.

ఏఐ మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. ట్యూషన్ టీచర్ అరెస్ట్
Visakhapatnam AI Morphed Images Case

విశాఖపట్నం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేసిన ట్యూషన్ టీచర్ షణ్ముఖ్ హితేష్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికకు చెందిన సాధారణ ఫొటోలను ఏఐ సహాయంతో అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి, వాటిని చూపిస్తూ ఆమెను బెదిరించాడు.


అసభ్యకరంగా మార్పులు చేసి...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు షణ్ముఖ్ హితేష్ వద్దే ట్యూషన్ చదువుతున్న మైనర్ విద్యార్థినిపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ఫొటోలను సేకరించి, ఏఐ టూల్స్ ఉపయోగించి అసభ్యకరంగా మార్పులు చేసి, ఆ చిత్రాలను చూపిస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. అలాగే తన మాట వినకపోతే ఆ ఫొటోలను ఇతరులకు పంపిస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని బాలిక ధైర్యంగా తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


14 రోజుల రిమాండ్..

ఈ కేసు దర్యాప్తులో నిందితుడు ఏఐ ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం షణ్ముఖ్ హితేష్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటనతో ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి బెదిరింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 22 , 2026 | 08:23 AM