Share News

విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రత్యేక దృష్టి: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:32 PM

విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. కేంద్రం పాలసీకి విరుద్ధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రత్యేక దృష్టి: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
Bhupathiraju Srinivasavarma

విశాఖపట్నం, జనవరి24 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ(Bhupathiraju Srinivasavarma) వ్యాఖ్యానించారు. కేంద్రం పాలసీకి విరుద్ధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒడుదుడుకులు లేకుండా నడుస్తోందనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి తాము ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్లాంట్‌పై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు స్టీల్ ప్లాంట్‌లో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గించామని ఆయన అన్నారు.


పొత్తులపై అధినాయకత్వానిదే తుది నిర్ణయం..

సాగర్ మాల కన్వెన్షన్స్‌లో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం 18వ రోజ్‌గార్‌ మేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు సీఐఎస్ఎఫ్ ఐజీ శర్వాణన్, సీఐఎస్ఎఫ్ డీఐజీ డా.రాఘవేంద్ర కుమార్, పోర్టు సెక్రెటరీ రమణమూర్తి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ ప్రసంగిస్తూ.. రాబోయే మూడు నెలల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయని ప్రస్తావించారు. పొత్తులపై అధినాయకత్వానిదే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 4న స్టీల్ కార్యదర్శి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వస్తున్నారని శ్రీనివాస వర్మ తెలిపారు.


తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం..

తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు శ్రీనివాస వర్మ. మూడు రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందని కాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో సినీ గ్లామర్ వర్కౌట్ కావడం లేదన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలమైన నాయకుడని.. ఏపీలో కలిసి పోటీ చేయడం వలన తమ కూటమి విజయం సాధించిందని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ పాలనపై విశ్వాసం ఉందని.. మోదీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. సినీ గ్లామర్‌కు మించిన స్టార్ ప్రధాని నరేంద్రమోదీ అని అభివర్ణించారు. భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక.. ఉద్యోగాల భర్తీకి మిషన్ మోడ్‌లో ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 17 రోజ్‌గార్‌ మేళాలు నిర్వహించినట్లు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2026 | 05:08 PM