Home Minister Anitha: ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు..హోంమంత్రి వార్నింగ్
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:04 AM
SVS కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా, జనవరి4(ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం సెజ్‌లో నిన్న జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. రాంబిల్లి మండలం, అచ్యుతాపురం, ఏపీఎస్ఈజడ్‌లో SVS కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద నిన్న(శనివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన స్థలాన్ని హోంమంత్రి అనిత, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో SVS కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత.
కంపెనీలో ఇన్ని ట్యాంకులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడారు. నిన్న దురదృష్టకరమైన సంఘటన జరిగిందని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించారని తెలిపారు. ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రమాద ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు అదుపు చేశారని చెప్పుకొచ్చారు. అధికారులు స్థానిక ఎమ్మెల్యే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారని అన్నారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ
Read Latest AP News And Telugu News