డయేరియా ప్రాంతంలో కేంద్రమంత్రి పర్యటన.. వైసీపీపై తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:38 PM
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో డయేరియా అదుపులోకి వచ్చిందని.. ప్రస్తుతం 102 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైసీపీ డయేరియా విషయంలోనూ శవ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
శ్రీకాకుళం, ఫిబ్రవరి 26: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ఈరోజు(గురువారం) పర్యటించారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్‌లో డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం డయేరియా వ్యాప్తి జరుగుతుందని తెలిసిన వెంటనే అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుతానికి 102 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని.. మొత్తం 120 కేసులు రిపోర్ట్ అయ్యాయని వెల్లడించారు. ప్రజలను ఆదిలోనే అప్రమత్తం చేయటంతో ప్రాణనష్టం నివారించగలిగామని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని అన్నారు. మంచినీటి సమస్య ఉందనే అపోహలు ఉన్నాయని... దానిపై మరింత విస్తృతంగా పరీక్షలు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై చర్చకు రాగలరా అంటూ వైసీపీకి సవాల్ విసిరారు కేంద్రమంత్రి. గత ప్రభుత్వంలో పనులన్నీ అయినవారికి కేటాయించి డబ్బులు తినేశారని ఆరోపించారు. రూ.100 కోట్లు పైగా గ్రాంట్స్ మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. డయేరియా విషయంలోనూ వైసీపీ శవ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో కాంట్రాక్టులు సిండికేట్ చేసి కమిషన్లు తీసుకున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు.
విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు.. వారి హయాంలో ఎందుకు పనులు మొదలు పెట్టలేదని కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రశ్నించారు. డయేరియా వల్ల చనిపోయిన ఒకరికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని.. మిగతా వారి మరణాలపై పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ నేతలు.. ప్రజల చావులను కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ కూర్మారావు సేవలు కార్పొరేషన్‌కు అవసరమని అన్నారు. హీట్ ఆఫ్ మూమెంట్‌లో ఆయన్ను సస్పెండ్ చేశారని.. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. కమిషనర్ కూర్మారావు విధుల్లో చేరిన 20 రోజుల్లో మంచి పనులు చేపట్టారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సోమువీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు.. మండలిలో ఉద్రిక్త వాతావరణం
కొత్త చట్టం.. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలను ఎలా పిలుస్తారంటే
Read Latest AP News And Telugu News