Share News

కొత్త చట్టం.. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలను ఎలా పిలుస్తారంటే

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:39 PM

గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభలో ఆమోదముద్ర పడింది. గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

కొత్త చట్టం.. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలను ఎలా పిలుస్తారంటే
AP Assembly Session

అమరావతి, ఫిబ్రవరి 26: ఏపీ శాసనసభలో గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు. గురువారం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ విజన్‌కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేశామని మంత్రి వివరించారు. అందుకు తగినట్లుగా సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు.


దీనిపై ఈ ఏడాది జనవరిలో గవర్నర్ గెజిట్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేశారన్నారు మంత్రి. సచివాలయాలు చాలా చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ప్రభుత్వ భవనాలున్న చోటికి వాటిని మారుస్తున్నామని మంత్రి తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తామని, అన్ని విభాగాల్లో సిబ్బందికి పదోన్నతులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని గవర్నింగ్ బాడీగా నియమించామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.


రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఈ చట్ట సవరణ ఉపయోగపడుతుందన్నారు. స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల పేర్లు ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తాయని అన్నారు. రాయలసీమలో ఉద్యాన పంటలు ఎక్కువగా ఉండటంతో అక్కడి సిబ్బందిలో హార్టికల్చర్ నిపుణులను నియమించవచ్చని సూచించారు. అభివృద్ధికి అసలైన చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చాలన్నారు. సంపద సృష్టించే క్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు.


విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని సచివాలయాల ద్వారా అమలు చేస్తోందని చెప్పారు. సచివాలయ సిబ్బందికి గవర్నింగ్ బాడీ ఎవరనే విషయంలో స్పష్టత లేదని.. దీనిపై చట్ట సవరణ ద్వారా స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.


ఇవి కూడా చదవండి...

రాయలసీమ ఎత్తిపోతల పథకం.. మండలిలో వైసీపీ, మంత్రుల మధ్య వాగ్వాదం

సోమువీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు.. మండలిలో ఉద్రిక్త వాతావరణం

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 26 , 2026 | 01:49 PM