Share News

తిరుమల లడ్డూపై చర్చ.. మండలిలో ఆందోళనలు.. రేపటికి వాయిదా

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:01 PM

తిరుమల లడ్డూ అంశంపై ఏపీ శాసనమండలిలో చర్చ గందరగోళానికి దారి తీసింది. దీంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను రేపటికి వాయిదా వేశారు.

తిరుమల లడ్డూపై చర్చ.. మండలిలో ఆందోళనలు.. రేపటికి వాయిదా
AP Legislative Council

అమరావతి, ఫిబ్రవరి 26: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) తిరుమల లడ్డూ అంశంపై స్వల్పకాలిక చర్చను ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రారంభించారు. చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో గందరగోళం ఏర్పడటంతో సమావేశాలను ఛైర్మన్ రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారు. స్వల్పకాలిక చర్చలో భాగంగా తొలుత వైసీపీ సభ్యుడు పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు ఛైర్మన్. చర్చ సాగుతుండగా ప్రభుత్వం తరఫున స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు తనకు అవకాశం కల్పించాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.


స్వల్పకాలిక చర్చలో స్టేట్‌మెంట్ చేసే అవకాశం మంత్రికి ఉండదని.. రిప్లై మాత్రమే ఉంటుందని మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు. స్టేట్‌మెంట్ కాపీలు సిద్ధం చేయాలని మండలి ఛైర్మన్ లేఖ రాశారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా ఆ లేఖ సిద్ధం చేశారని ఛైర్మన్ తెలిపారు. తిరుమల లడ్డూపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముందుగా ప్రభుత్వం నుంచి స్టేట్‌మెంట్‌కు అవకాశం కల్పించాలన్నారు మంత్రి.


చర్చకు ప్రభుత్వం భయపడుతోందని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దేవదేవుడి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తిరుమల లడ్డూపై సభలో చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శాసనమండలి సమావేశాలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

సోమువీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు.. మండలిలో ఉద్రిక్త వాతావరణం

కొత్త చట్టం.. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలను ఎలా పిలుస్తారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 26 , 2026 | 02:13 PM