మీ భూమి-మీ హక్కును కాపాడే బాధ్యత మాది: చంద్రబాబు
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:22 PM
రైతు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలి గానీ, అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరగడానికి వీలు లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రకాశం, అక్టోబర్ 9: రైతు హలం పట్టుకుని పొలానికి వెళ్లాలి గానీ, అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరగడానికి వీలు లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘మీ భూమి మీ హక్కు, భూమి మీదే హక్కు మీదే. ఆ హక్కు కాపాడే బాధ్యత మాది. ఇది సీబీఎన్ మార్క్’ అని స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) కొండపి నియోజకవర్గం నర్సింగోలులో పర్యటించిన ముఖ్యమంత్రి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మీ భూమి-మీ హక్కు సభలో పాల్గొని, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చామని తెలిపారు. అక్టోబర్‌లోనే 793 గ్రామాల్లో 4.58 లక్షల మందికి పాస్ పుస్తకాలిచ్చామని.. ప్రకాశం జిల్లాలోనే 24,116 పాస్‌పుస్తకాలను ఇచ్చినట్లు తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీ కోసం అధికారులకు టార్గెట్ ఇచ్చామని.. టార్గెట్ అందుకోకపోతే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పోతుల చెంచయ్యపాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. ఈ రిజర్వాయర్ రెండు సంవత్సరాల్లో పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.166 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని.. దీనివల్ల 9,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఎప్పుడో నరకాసురుడు వధ జరిగితే ఈరోజు కూడా దీపావళి జరుపుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. చెడుని ప్రోత్సహించకూడదని మంచి వాళ్లకు అండగా ఉండాలని అప్పుడే సమాజానికి మంచి జరుగుతుందని దీపావళిని జరుపుకుంటామన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా నవ్వారా? ఇంట్లో ఉన్నప్పుడు భద్రత ఉందా? మీ భూములకు భద్రత ఉందా..?’ అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా విధ్వంసమే అని విమర్శించారు. తనకు ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదని.. కానీ సమస్యలు మాత్రం చాలా కొత్త సమస్యలు తెచ్చారన్నారు. ఇన్ని సమస్యలను జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ వివాదాలమయం. భూ కబ్జాల్ని ప్రోత్సహించారు. ఆక్రమణలు, దందాలతో భయంకరమైన వాతావరణం ఉండేది. ఈరోజు రాజ ముద్ర, గ్యారంటీతో పట్టాదారు పాసు పుస్తకాన్ని ఇచ్చాం. ఒక్కసారి పాత పాసు పుస్తకాన్ని తిరగేయండి. మీ ఆస్తిపై బొమ్మ ఇంకెవరిదో... అది న్యాయమా’ అని ప్రశ్నించారు.
తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. ‘నాకు అనుభవం ఉంది, పవన్‌కు తపన ఉంది, ప్రధాని అండ ఉంది. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. డబుల్ ఇంజన్ సర్కార్.. త్రిబుల్ బుల్లెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కష్టపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా 8 మంది మంత్రులను కలిశానన్నారు. ‘నాకు భేషజాలు లేవు..నా ప్రజల కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా. నా ప్రజల కోసం ఎవరిని కలవడానికైనా సిద్ధమే’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
కాగా.. కొండపి నియోజకవర్గం నరసింగోలులో రూ.27.85 కోట్లతో ముప్పాళ్ల వద్ద బ్రిడ్జి నిర్మాణం, పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ స్పిల్ వే, ప్రధాన తూముల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గర్భ కండ్రిక భూ సమస్యల్ని పరిష్కరించి రైతులకు హక్కు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
నెల్లూరులో ప్రభుత్వ హైస్కూల్ ఆధునికీకరణ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన
బీసీలకు 34 శాతం టికెట్లు ఇచ్చి తీరుతాం: గల్లా మాధవి
Read Latest AP News And Telugu News