వెలిగొండ నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. కటాఫ్ డేట్ దాటినా యువతకు రూ.2 లక్షల సాయం
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:56 PM
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రజా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. కటాఫ్ డేట్ ముగిసినా అర్హులైన 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్థిక సాయం అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
మార్కాపురం, ఆగస్టు 28: వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రజా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. కటాఫ్ డేట్ ముగిసినా అర్హులైన 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్థిక సాయం అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రూ.169 కోట్లను ఆర్థిక సాయంగా అందించనున్నారు. గెజిట్ సహా, సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాని, అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అవార్డు పాస్ కాని యువతకు కూడా ఆర్థిక సాయం అందేలా చూడాలని సూచనలు చేశారు.
ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టుల వద్ద భూములు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో మొత్తం 1800 గ్రీవెన్సులు, పిటిషన్లను పరిశీలించి వారికి న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2019 కటాఫ్ డేట్ నుంచి 2026 వరకూ 18 ఏళ్లు నిండిన యువతకు కూడా రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. నిర్వాసితులకు చెల్లించిన పరిహారానికి అదనంగా రూ.169 కోట్ల సాయంగా అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవార్డులో లేని నిర్వాసితుల్ని గుర్తించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 7027 మంది నిర్వాసిత కుటుంబాలకు రూ.905 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని సర్కార్ అందించిన విషయం తెలిసిందే. 2019 కటాఫ్ డేట్ తర్వాత 18 ఏళ్ల నిండిన వారికి ఆర్థిక సాయం అందించేలా సీఎం చంద్రబాబు మానవతా దృక్పథంతో వ్యవహరించారు. నిర్వాసితులకు నెల రోజులకు సరిపడా రేషన్ కిట్‌ను కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం: మంత్రి నిమ్మల
ఏ ప్రాజెక్టులోనూ ఇవ్వనంత భరోసా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అర్హుల జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి 1800 గ్రీవెన్సులు వచ్చాయని, వాటిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. నేటి నుంచే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థికసాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వటంతో పాటు చివరి నిర్వాసితుడికి న్యాయం చేసేంత వరకూ ప్రక్రియ కొనసాగిస్తామని అన్నారు.
నిర్వాసితులకు ఎక్కడా అన్యాయం జరిగిందన్న మాట లేకుండా చూస్తామని మంత్రి వెల్లడించారు. నిర్వాసిత కాలనీల్లోనూ మౌలిక సదుపాయాలను పూర్తి చేసి వారికి న్యాయం చేస్తామన్నారు. గత పాలకులు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే డ్రామాలు ఆడారని విమర్శించారు. సూపర్ ఎల్ నినో పరిస్థితుల్లోనూ సమర్ధంగా నీటి నిర్వహణ చేపట్టి డెల్టాలో పంటలకు నీరిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ
రాఖీ కేవలం దారం కాదు.. ప్రేమ, నమ్మకం, బాధ్యతకు ప్రతీక: బాలకృష్ణ
Read Latest AP News And Telugu News