Bhuma Akhila Priya: ఇలాంటి నీచపు పనులకు పాల్పడొద్దు.. వారికి భూమా అఖిలప్రియ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jan 11 , 2026 | 09:55 AM
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గోవుల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆల్ఫా కాలేజ్ సమీపంలో భారీ ఎత్తున గోవులను తరలిస్తున్న వాహనాలను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు..
నంద్యాల, జనవరి11(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గోవుల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆల్ఫా కళాశాల సమీపంలో భారీ ఎత్తున గోవులను తరలిస్తున్న వాహనాలను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా గోవులను తరలిస్తున్న తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంటైనర్లలో గోవుల తరలింపు..
ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనాలను తనిఖీ చేసిన సమయంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో కంటైనర్‌లో సుమారు 70కు పైగా గోవులను అత్యంత క్రూరంగా, ఒకదానిపై ఒకటి కుక్కి తరలిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 5 భారీ వాహనాలను (కంటైనర్లు, లారీలు) ఎమ్మెల్యే అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. తన కళ్లముందే మరో 10 కంటైనర్లు వేగంగా వెళ్లిపోయాయని, వాటిని కూడా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.
తెలంగాణ నుంచి పులివెందులకు రవాణా..
పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ గోవులను తెలంగాణ రాష్ట్రం నుంచి కడప జిల్లా పులివెందులకు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి కంటైనర్ వెనుక ఒక ఇన్నోవా కారు ఫాలో అవుతుండడం చూస్తుంటే.. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానించారు. ఈ గోవులు ఎవరివి? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే విషయాలను పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బయటపెట్టాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు.
నీచపు పనులు వద్దు.. ఎమ్మెల్యే హెచ్చరిక..
గోవులను హింసిస్తూ అక్రమంగా తరలించే ఇలాంటి నీచపు పనులకు ఎవరూ పాల్పడవద్దని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. మూగజీవాలపై క్రూరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేకుండా జరుగుతున్న ఈ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News