జగన్ హయాంలో రైతులను పట్టించుకోలేదు.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజం
ABN , Publish Date - Feb 21 , 2026 | 09:45 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు.
నంద్యాల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వంలో అన్నదాతల సమస్యలని త్వరితగతిన పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. తమది రైతు అనుకూల.. రైతు పక్షపాతి ప్రభుత్వమని పేర్కొన్నారు. బనగానపల్లెలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ(శనివారం) ప్రారంభించారు. బనగానపల్లెలో రూ. 65 లక్షల నిధులతో నిర్మించిన 2 వ్యవసాయ గోడౌన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు. రైతన్నలకు నష్టం రాకూడదనే ఆలోచనతో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
రెండు గోడౌన్లుకు శంకుస్థాపన చేశాం..
రైతులకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు రైతుల తరఫున మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ రెండు గోడౌన్లకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. దాదాపు రూ.65 లక్షలతో చేపట్టిన ఈ గోడౌన్ల నిర్మాణంలో 50 శాతం పనులు తమ హయాంలోనే పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో కక్ష సాధింపుతో పనులు ముందుకు సాగనివ్వలేదని ధ్వజమెత్తారు. గోడౌన్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గతంలో ధర్నాలు కూడా చేశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ పనులు పూర్తి చేసి రైతులకు అంకితమిస్తున్నామని వివరించారు.
రైతులకు ఎంతో ఉపయోగకరం..
నేడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు శ్రేయస్సు కోసం గోడౌన్ల నిర్మాణం పూర్తి చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నేడు ప్రైవేట్ గోడౌన్లలో ధరలు ఎక్కువ ఉన్న క్రమంలో ఇవి రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు.ఈ క్రాప్ బుక్ చేసుకోకపోతే రైతుల పంటలు కొనుగోలు చేయరని.. కాబట్టి ఇప్పటికైనా రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. శనగల కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కనీస మద్దతు ధర రూ. 5,875లకు ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. శనగలు అమ్మే రైతులు CMAPP ద్వారా రైతు సేవా కేంద్రాల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. శనగలు ఎకరాకు 10 క్వింటాళ్లు (e-crop) పరిమితి లేకుండా తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News