లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:49 PM
ఏపీ మంత్రి నారా లోకేశ్ కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులతో నిర్వహించిన విందు సమావేశం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా సాగింది. శుక్రవారం లోకేశ్ ఉండవల్లి నివాసంలో రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు..
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సమన్వయం కేవలం పాలనకే పరిమితం కాకుండా, కుటుంబ బంధాలను బలోపేతం చేసే దిశగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విందు సమావేశం దీనికి నిదర్శనంగా నిలిచింది.
కుటుంబ విలువల ప్రతిబింబం..
మంత్రి నారా లోకేశ్ తన నివాసంలో కూటమి ప్రజాప్రతినిధుల కోసం వరుసగా విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ (శుక్రవారం) రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ఉండవల్లి నివాసం సందడిగా మారింది.
మూడు పార్టీలు.. ఒకే కుటుంబం..
ఈ విందు కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రజాప్రతినిధులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ‘కూటమి అంటే కేవలం మూడు పార్టీల కలయిక కాదు, ఇదొక పెద్ద కుటుంబం’ అనే సందేశాన్ని ఈ సమావేశం చాటిచెప్పింది. కృష్ణా నది ఒడ్డున సాగిన ఈ ఆతిథ్యం గోదావరి జిల్లాల అతిథులకు సరికొత్త అనుభూతిని మిగిల్చింది.
విందులో వెల్లివిరిసిన సందడి
ఉండవల్లి నివాసం ఒక ఉత్సవ వాతావరణాన్ని తలపించింది. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత విషయాలపై నేతలు చర్చించారు. కూటమి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. నివాస ప్రాంగణంలో పిల్లల ఆటపాటలతో సందడి నెలకొంది.
లోకేశ్‌కు ప్రత్యేక కానుకలు..
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు లోకేశ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రాజమండ్రి 'రత్నం పెన్'ను లోకేశ్‌కు బహూకరించారు.
ఎంబ్రాయిడరీ చిత్రం..
లోకేశ్ - బ్రాహ్మణి దంపతుల చిత్రాన్ని వస్త్రంపై ఎంతో ఓపిగ్గా ఎంబ్రాయిడరీ చేయించి.. ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ కానుకగా ఇచ్చారు. ఈ అపురూప కానుక లోకేశ్‌ను విశేషంగా ఆకట్టుకుంది.
మంగళగిరి పట్టుచీరల ఆత్మీయత..
విందు అనంతరం లోకేశ్ దంపతులు తమ అతిథులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. మహిళా అతిథులందరికీ మంగళగిరి నేతన్నల నైపుణ్యానికి గుర్తింపుగా మంగళగిరి పట్టు చీరలను లోకేశ్ స్వయంగా కానుకగా అందజేశారు. ఇది నేతన్నలకు మద్దతు తెలపడంతో పాటు అతిథుల పట్ల గౌరవాన్ని చాటినట్లయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Read Latest Telangana News And AP News And Telugu News