Share News

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

ABN , Publish Date - Jun 08 , 2026 | 03:14 PM

గొడ్డలి పార్టీ విధ్వంసంతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వికాస పాలన సాగుతోందన్నారు.

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి
BC Janardhan Reddy

నంద్యాల, జూన్ 8: గొడ్డలి పార్టీ విధ్వంసంతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వికాస పాలన సాగుతోందన్నారు. ప్రజలు అరాచక పాలన చూసి, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు కట్టబెట్టారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలను నెరవేరుస్తున్నామన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అనాధగా మారిస్తే... నేడు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని ప్రతిపక్షాలు అంటే అమలు చేసి చూపించామన్నారు. పెన్షన్ రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని.. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని అన్నారు.


గతంలో తల్లికి వందనం పథకం ఇద్దరు పిల్లలకు ఇస్తామని మోసం చేశారని.. నేడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులందరికీ అన్నదాత సుఖీభవ అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గ్రామాల్లో కనీసం తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదన్నారు. గ్రామాల్లో దాదాపు 4 వేల కిలోమీటర్ల సీసీ రహదారులను నిర్మించామని తెలిపారు. గతంలో తలెత్తుకు తిరిగే ఆర్ & బి శాఖను తలదించుకునేలా చేశారని విమర్శించారు. 6 నెలల్లో 27 వేల కిలోమీటర్ల రహదారులను గుంతలరహితంగా తీర్చిదిద్దామని తెలిపారు. రూ.3 వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.


గత ప్రభుత్వంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత తిరిగి వాటిని పట్టాలెక్కించారన్నారు.16 వేల డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తే కరపత్రికను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీచర్ ఉద్యోగాలు పొందిన వారి మనోభావాలు దెబ్బ తినేలాగా, వారి కృషిని అవమానించేలా వైసీపీ వ్యవహార శైలి ఉందని వ్యాఖ్యానించారు. గతానికి, నేటికి.. సంక్షేమ - అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. కేవలం ఒక కరపత్రిక, ఒక ఛానల్‌ను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరన్నారు.


‘గతంలో ఎవడబ్బ సొమ్ము అనుకుని పట్టాదారు పాస్ పుస్తకాలపై మీ ఫొటో వేయించుకున్నారు. మీ నాన్న ఆస్తుల.. మీ తాత రాజారెడ్డి ఆస్తుల.. ఎవరి ఆస్తులని ఫొటోలు వేసుకున్నారు?’ అని మంత్రి ప్రశ్నించారు. నేడు కూటమి ప్రభుత్వంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో పోలవరం పక్కనపెట్టారని.. అమరావతిని నిండా ముంచేశారని దుయ్యబట్టారు. రాయలసీమలో గోరకల్లు లిఫ్ట్ ఇరిగేషన్‌కు నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. అలగునూరు ప్రాజెక్టు కూడా తామే పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. నేడు ‘సర్’ విషయంలో ప్రజలు, ఓటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చాలామంది ఓట్లు తీసేందుకు, దొంగ ఓట్ల నమోదుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నంద్యాల జిల్లా అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బిహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

జగన్ పిచ్చితనానికి ట్రీట్‌మెంట్ ఎక్కడో తెలియడం లేదు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 03:21 PM