మూలనక్షత్ర పర్వదిన సందర్భంగా విజయవాడలో ప్రత్యేక ఏర్పాట్లు: కలెక్టర్ లక్ష్మీశ
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:09 PM
మూల నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు(శుక్రవారం) అమ్మవారిని అధికసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకోనున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఇంద్రకీలాద్రిలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 15: అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలనక్షత్రం సందర్భంగా రేపు విజయవాడలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. అమ్మవారు రేపు శ్రీ సరస్వతీ మాతా అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తెల్లవారుజామున 1 గంట నుంచి దర్శనాలు: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
మూలనక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు(శుక్రవారం) తెల్లవారుజాము 1 గంట నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్లు, భక్తులెవరూ హోల్డింగ్ ఏరియా దాటి దర్శనానికి రాకూడదని సూచించారు. అక్కడే భక్తులకు అవసరమైన త్రాగు నీరు, పాలు, ప్రసాదం, బిస్కెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. క్యూలైన్లో వచ్చిన వారికే దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు.
సామాన్య భక్తులకే ప్రాధాన్యం: రామచంద్రమోహన్, దేవాదాయశాఖ కమిషనర్
‘ఈసారి మూల నక్షత్రం సందర్భంగా 2.5 లక్షల మంది అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తాన్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. మూల నక్షత్రం నాడు సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. వారి సౌకర్యం, భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. సిబ్బందితో భక్తులు సహకరించాలి. బారికేడ్లు దూకడం, దర్శనానికి వేరే మార్గాలు వెతకడం లాంటివి చేయకూడదు’ అని కమిషనర్ రామ చంద్రమోహన్ తెలిపారు.
4000ల మంది పోలీసులతో బందోబస్తు: సీపీ రాజశేఖర్ బాబు
విజయవాడ ఉత్సవాల్లో భాగంగా 3500+900 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటుచేసినట్లు సీపీ రాజశేఖర్ తెలిపారు. చిన్నపిల్లల భద్రత దృష్ట్యా వారికి చైల్డ్ ట్యాగ్లు వేసి దర్శనానికి తీసుకురావాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. 3 హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్లు, వర్షం కురిస్తే మహామండపం నుంచి దర్శన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏ హోల్డింగ్ ఏరియా నుంచి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియజేసేలా డిజటల్ బోర్డ్స్ను ఏర్పాటు చేశామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రిపై వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు: దుర్గ గుడి ఈవో
కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు
విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్
Read Latest AP News And Telugu News