భోగాపురం ఎయిర్‌పోర్ట్ తరహాలో విజయవాడ విమానాశ్రయం: కేంద్ర మంత్రి
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:31 PM
ఈ రోజు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించారు.
అమరావతి, సెప్టెంబరు 8: తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు(మంగళవారం) విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను ఆయన సందర్శించారు. విమానాశ్రయంలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులు నిర్మాణ పనుల ప్రగతిని కేంద్ర మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ పనులు త్వరగా పూర్తిచేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. గతంలో కాంట్రాక్టర్ కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని, ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్‌ను ఏర్పాటుచేసి పనులను వేగవంతం చేస్తున్నామని వివరించారు. ఎన్నో సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి పనులను కొనసాగిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ తరహాలో కల్చరల్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలుగు ప్రజల సంస్కృతితో అనుసంధానమయ్యేలా, కృష్ణానది, దుర్గమ్మ ఆలయ ప్రత్యేకతలను ప్రతిబింబించేలా టెర్మినల్ నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ గర్వపడేలా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతామన్నారు.
ఇవి కూడా చదవండి:
కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలు చేయొద్దు: హోంమంత్రి అనిత
మెగా డీఎస్సీపై వైసీపీది తప్పుడు ప్రచారం: టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు