మిడ్‌టర్మ్ ఎన్నికలు.. డెమోక్రటిక్ పార్టీ వైపే భారతీయ అమెరికన్ల మొగ్గు
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:51 PM
అమెరికాలో త్వరలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్లలో అధిక శాతం మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తాజాగా జరిగిన ఓ సర్వేలో వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో త్వరలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్లలో అధిక శాతం మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తాజాగా జరిగిన ఓ సర్వేలో వెలుగులోకి వచ్చింది. ఏషియన్ అండ్ పసిఫిక్ ఐల్యాండర్ అమెరికన్ ఓటు సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఈసారి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నామని సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది చెప్పినట్టు సంస్థ తన నివేదికలో పేర్కొంది. అధికార, ప్రతిపక్ష పార్టీ ప్రచార కార్యక్రమాలు కాస్త మందకొడిగా సాగుతున్నా జనాలు మాత్రం ఈ ఎన్నికల్లో కాస్త పెద్ద సంఖ్యలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపింది. ప్రతినిధుల సభతో పాటు 35 సెనెట్ సీట్లు, అమెరికా వ్యాప్తంగా పలు స్థానిక సంస్థలకు నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
ఈ సర్వే ప్రకారం, ప్రతినిధుల సభతో పాటు సెనెట్ ఎన్నికల్లో ఈసారి 66 శాతం మంది భారతీయ అమెరికన్లు ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి ఓటు వేయనున్నారు. ప్రతినిధుల సభ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్లకు ఓటు వేస్తామని 18 శాతం మంది భారతీయ అమెరికన్లు చెప్పగా, సెనేట్ ఎన్నికల్లో అధికార పక్షానికి ఓటు వేస్తామని 22 శాతం మంది చెప్పారు. ఆసియా సంతతి అమెరికన్ల ఓట్ల శాతం పెరుగుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలు కీలకంగా మారాయని పరిశీలకులు చెబుతున్నారు. జీవనవ్యయాలు, ద్రవ్యోల్బణమే తమ ఓటింగ్ తీరుతెన్నులను అధికంగా ప్రభావితం చేస్తాయని ఆసియా సంతతికి చెందిన ఓటర్లు ఈ సర్వేలో తెలిపారు. 16 మిలియన్ల మంది ఆసియా దేశాల సంతతి వారు, పసిఫిక్ ఐల్యాండర్లు ఈసారి ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఆ గ్రీన్ కార్డుల కోటా పూర్తి కావొచ్చు.. అలర్ట్ చేసిన యూఎస్
మహిళా సిబ్బందిని వద్దనడంతో వివాదం.. ఈఫిల్ టవర్ మూసివేత