Share News

కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలు చేయొద్దు: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:15 PM

పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు హోంమంత్రి వంగలపూడి అనిత కీలక సూచనలు చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆమె.. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసి ఆందోళనలకు ప్రేరేపించినా నమ్మొద్దని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.

కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలు చేయొద్దు: హోంమంత్రి అనిత
Police Constable Recruitment

అమరావతి, సెప్టెంబర్ 8: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరూ ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిగొద్దని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని.. ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో పోలీసు ఉద్యోగాలు లభించాయో అభ్యర్థులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందని.. అందులో భాగంగా సుమారు 11 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.


2014-19 మధ్య శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కూటమి ప్రభుత్వం 9,793 పోలీసు పోస్టులను భర్తీ చేసిందని అనిత గుర్తుచేశారు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చి.. సుమారు 6 వేల పోస్టులను గాలికొదిలేశారని విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 6 వేల పోస్టుల భర్తీకి ఉన్న ఇబ్బందులను అధిగమించి ప్రక్రియను క్లియర్ చేశామని తెలిపారు. పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టైఫండ్‌ను రూ.12 వేలకు పెంచిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని హోంమంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలని అనిత సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం

అమరావతిని మారుస్తామనడం అవివేకం

For More AP News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 01:50 PM