Share News

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం

ABN , Publish Date - Sep 07 , 2026 | 07:49 PM

తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు ఖండించారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ ఎంపీల సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 32 మంది ఎంపీలు ఈ సమావేశానికి హాజరై.. ఎస్సీ, ఎస్టీ ఎంపీల కోసం ప్రత్యేక ఫోరంను ఏర్పాటు చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం
Congress SC ST MPs Forum

న్యూఢిల్లీ: ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం జరిగిన ‘ప్యూరిఫికేషన్’ ఘటనను కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఇందిరా భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ ఎంపీల సమావేశంలో ‘ప్యూరిఫికేషన్‌’ ఘటనపై చర్చించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 32 మంది కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ ఎంపీల కోసం ప్రత్యేకంగా ఒక ఫోరంను ఏర్పాటు చేశారు.


చర్యలు తీసుకోవాలి: గడ్డం వంశీ

కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల పట్ల బీజేపీకి చిన్నచూపు ఉందని ఆరోపించారు. ఖర్గే కార్యక్రమం అనంతరం ప్యూరిఫికేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించామని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను కూడా గడ్డం వంశీ ఖండించారు. కేటీఆర్‌ ‘కట్టప్ప’లా అందరినీ వెనుక నుంచి పొడుస్తుంటారని గడ్డం వంశీ ఆరోపించారు.

కేసీఆర్‌ 1,500 మంది ప్రాణాలు బలిగొని సీఎం అయ్యారని కాంగ్రెస్‌ ఎంపీ గడ్డం వంశీ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ 25 మంది విద్యార్థులను ఆత్మహత్యకు ప్రేరేపించేలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు, పోలీసులపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రారని.. కానీ కేటీఆర్‌ పోలీసులపై దాడులు చేస్తున్నారని గడ్డం వంశీ అన్నారు. త్వరలోనే కేటీఆర్ తగిన గుణపాఠం చెబుతామని గడ్డం వంశీ హెచ్చరించారు.


ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ఫోరం

కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఎంపీల కోసం ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఖర్గే కార్యక్రమం అనంతరం జరిగిన ప్యూరిఫికేషన్ ఘటనను ఖండిస్తున్నామని, బీజేపీ తీరును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కడియం కావ్య మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే కార్యక్రమం అనంతరం ప్యూరిఫికేషన్ చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. సుమారు మూడు గంటల పాటు ఎస్సీ, ఎస్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై చర్చించామని చెప్పారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను కడియం కావ్య ఖండించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఒక వ్యక్తికి జరిగిన అవమానంగా కాకుండా మొత్తం ఎస్సీ సమాజానికి జరిగిన అవమానంగా చూస్తున్నామని కడియం కావ్య అన్నారు.


Also Read:

శాసనసభ కాదు.. దుశ్శాసనసభ. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం!

లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Updated Date - Sep 07 , 2026 | 07:57 PM