Share News

శాసనసభ కాదు.. దుశ్శాసనసభ. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం!

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:49 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, నిరసనకారులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ టీ షర్ట్ నిరసనల అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

శాసనసభ కాదు.. దుశ్శాసనసభ. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం!
KTR Slams Revanth Reddy Over Assembly Row, Calls It ‘Dushasana Sabha’

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, నిరసనలు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభను కాంగ్రెస్ ప్రభుత్వం 'దుశ్శాసన సభ'గా మార్చివేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పోలీస్ బృందం కిరాతకంగా వ్యవహరించాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


అసెంబ్లీలో కాంగ్రెస్ ఎంత రెచ్చగొట్టినా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించాలని తమ అధినేత కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు. నాడు పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ టీ-షర్టులు ధరించి నిరసన తెలిపిన తరహాలోనే తాము కూడా అసెంబ్లీకి వెళ్లామని స్పష్టం చేశారు.

అజాతశత్రువులుగా పేరున్న మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు ప్రవర్తించిన తీరును సమాజం నిశితంగా గమనించిందని అన్నారు. అసలు ఏ రూల్ ప్రకారం తమను అడ్డుకున్నారో చెప్పడానికి అధికారుల వద్ద సమాధానం లేదన్నారు.

టీ-షర్టులపై ఎలాంటి అభ్యంతరకర పదాలు లేవని, అలా ఉన్నాయని అనడానికి డీసీపీ శిల్పవల్లి ఎవరని నిలదీశారు. రేవంత్ రెడ్డిని నిలదీస్తామనే భయంతోనే తమను అడ్డుకున్నారని, ఆ తర్వాత ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కొత్త నాటకాలకు తెరలేపారని ఆరోపించారు.

సభలో జరిగిన గలాటాకు ఆద్యుడు ముఖ్యమంత్రేనని కేటీఆర్ విమర్శించారు. 'వలువలు విప్పుతా' అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు విలువల గురించి మాట్లాడటం, అసెంబ్లీలో బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీ.కే. అరుణకు తాను, జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు సభలో జరిగిన ఘటనకు రేవంత్ రెడ్డి స్పందించి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని, సభలో నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సర్వభ్రష్ట ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క

రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత

Updated Date - Sep 07 , 2026 | 06:03 PM