Share News

అమరావతిని మారుస్తామనడం అవివేకం

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:37 AM

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అమరావతి నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు వ్యయం చేశాక రాజధానిని మరోచోటకు మారుస్తామనడం అవివేకమన్నారు.

అమరావతిని మారుస్తామనడం అవివేకం

అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అమరావతి నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు వ్యయం చేశాక రాజధానిని మరోచోటకు మారుస్తామనడం అవివేకమన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా ప్రైవేటు వ్యక్తులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మంచిదని అన్నారు. ప్రభుత్వ ధనంతోనే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సరికాదన్నారు. రాజకీయ పార్టీని స్థాపిస్తున్న నేపథ్యంలో సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా నాటికి తాను కొత్త రాజకీయ పార్టీని పెడతానని, జెండా, అజెండాను వెల్లడిస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనన్నారు. మహారాష్ట్రలో బాల్‌ఠాక్రే తరహాలో రాజకీయ గురువులా వ్యవహరిస్తానని చెప్పారు. తమ పార్టీలో 25-40 ఏళ్ల మధ్య ఉన్న యువతకే 66 శాతం సీట్లు స్థానిక సంస్థల నుంచి చట్టసభల దాకా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో రెడ్లు, కమ్మ కుటుంబాలే రాజ్యాధికారంలో ఉండాలా? సామాజికంగా వెనుకబడ్డ కులాలు, కాపులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అర్హత లేదా అని ప్రశ్నించారు.


తన పార్టీలో కమ్మ, రెడ్డి మినహా ఇతర కులాలు, మతాలలో సమర్థత, నాయకత్వ లక్షణాలున్నవారిని ముఖ్మమంత్రిగా ఎంపిక చేస్తానని ప్రకటించారు. టీడీపీ, వైసీపీలు మాత్రమే రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా చలామణి కావాలా? ఆ పార్టీల అధినేతలు మాత్రమే ముఖ్యమంత్రిగా అర్హులా అని అన్నారు. పార్టీ స్థాపన ఒక కొలిక్కి రానందున ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత లేదని చెప్పారు. విజయవాడ తరహాలో తిరుపతి, విశాఖల్లో పత్రికా సమావేశం పెడతానని, కాంక్లేవ్‌ను నిర్వహిస్తానని, ఆ తర్వాత పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తానని అన్నారు. తాను పాదయాత్ర చేస్తానని, రహదారులపై కాకుండా ప్రజల మధ్య గ్రామాల్లో తిరుగుతానని చెప్పారు. తనను నమ్మకద్రోహి అంటూ వైసీపీ నేతలు మళ్లీ విమర్శిస్తే ఘాటుగా సమాధానం చెబుతానన్నారు. కేఏ పాల్‌ను తప్పుపట్టిన బొత్స సత్యనారాయణ పార్టీలు మారలేదా అని అన్నారు. వైఎస్‌ మరణం తర్వాత మంత్రి హోదాలో అసెంబ్లీ వేదికగా వైఎస్‌ విజయమ్మను బొత్స తూలనాడలేదా అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్‌కు దమ్ముంటే తనపై ఉన్న కేసులు నిరూపించాలని, తనను అరెస్టు చేయాలని సవాల్‌ చేశారు. తమ పార్టీ మతమార్పిడిల విషయంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తరహాలో వ్యవహరిస్తుందని చెప్పారు. రాజకీయపార్టీలు అధికారంలోకి రావాలంటే డబ్బులు అవసరం లేదని తమిళనాడులో విజయ్‌ గెలుపు నిరూపించిందని విజయసాయి అన్నారు.

ఈ వార్తలనూ చదవండి

నియోజకవర్గానికో కోటి!

రాష్ట్ర ఆర్థిక సంఘానికిపటిష్ఠ డేటా వ్యవస్థ

Updated Date - Sep 08 , 2026 | 06:37 AM