కసిరెడ్డి, చాణక్యకే అన్నీ తెలుసు!
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:18 AM
మద్యం ముడుపుల వ్యవహారమంతా రాజ్ కసిరెడ్డి, బూనేటి చాణక్యకే తెలుసని ఈ స్కాంలో కీలక నిందితుడైన తుకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. మద్యం కుంభకోణంలో అక్రమ లావాదేవీలన్నీ వారిద్దరికే తెలుసని, తన పేరుతో జరిగిన వ్యవహారాల్లోనే తాను నిమిత్తమాత్రుడినని చెప్పినట్లు సమాచారం.
మద్యం ముడుపుల అంతిమ లబ్ధిదారెవరో నాకు తెలీదు
నా పేరుతో డొల్ల కంపెనీలు సృష్టించింది కసిరెడ్డే
ఈవీల వ్యాపారం పేరుతో నన్ను ఊబిలోకి దించాడు
‘సిట్’ విచారణలో గుట్టువిప్పిన తుకేకుల ఈశ్వర్
7 గంటలు.. వందకుపైగా ప్రశ్నలు
అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మద్యం ముడుపుల వ్యవహారమంతా రాజ్ కసిరెడ్డి, బూనేటి చాణక్యకే తెలుసని ఈ స్కాంలో కీలక నిందితుడైన తుకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. మద్యం కుంభకోణంలో అక్రమ లావాదేవీలన్నీ వారిద్దరికే తెలుసని, తన పేరుతో జరిగిన వ్యవహారాల్లోనే తాను నిమిత్తమాత్రుడినని చెప్పినట్లు సమాచారం. కసిరెడ్డి తనతో సంతకాలు పెట్టించి నకిలీ ఖాతాలు సృష్టించి పూర్తిగా తనను ఊబిలోకి తోసివేశాడని వాపోయినట్లు తెలిసింది. కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు గురించి అడుగగా.. తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. మద్యం రవాణా కంపెనీల టెండర్ల అవకతవకలపై అత్యంత కీలక సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. జగన్ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని మూడు రోజుల కస్టడీకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు.. సోమవారం గుంటూరు జైలు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఏడు గంటల పాటు విచారించారు. 100కు పైగా ప్రశ్నలు వేశారు. ముడుపుల సొమ్ము ఎక్కడికి చేరిందో తనకు తెలియదన్న కిరణ్.. అక్రమ దారులన్నీ కసిరెడ్డి, చాణక్యకే తెలుసని చెప్పినట్లు సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీకి పెట్టుబడి పెడతామని చెప్పడంతో నమ్మానని.. ఈ ఊబిలోకి తన ఫ్రెండ్స్‌ను కూడా అనవసరంగా దించానని వాపోయినట్లు తెలిసింది. ఐఐటీ చదువుకున్న తాను ఇలాంటి ఉచ్చులో పడతానని అనుకోలేదని చెప్పినట్లు సమాచారం. తనకు మొదట్లో లిక్కర్ స్కాం గురించి తెలియదని.. కొంత కాలానికి తెలిసినా బయటకు రాలేని పరిస్థితిలోకి వెళ్లిపోయానంటూ కిరణ్ కంటతడి పెడినట్లు సమాచారం. తనతో పాటు తన స్నేహితులను కూడా కసిరెడ్డి ముంచేశాడని ఆవేదన వ్యక్తంచేశాడు. తన పేరుతో డొల్ల కంపెనీలు సృష్టించింది అతడేనన్నాడు. ఏపీలో వైసీపీ ఓడిపోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవగానే.. విదేశాలకు పారిపొమ్మని తనకు చెప్పాడని.. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాడని కిరణ్ వాపోయాడు. వ్యాపారాలు చేద్దామని చెప్పి దేశం దాటాక అక్కడ ఏమీ చూసుకోలేదని, ఎప్పటికైనా అరెస్టు తప్పదని దిక్కుతోచక వచ్చేశానని చెప్పినట్లు తెలిసింది.
స్టేట్‌మెంట్‌పై సంతకానికి నిరాకరణ..
సిట్ ముందు వాగ్మూలం ఇచ్చిన కిరణ్.. తాను చెప్పినవి రికార్డు చేసిన తర్వాత స్టేట్‌మెంట్ కాపీపై సంతకం పెట్టేందుకు నిరాకరించాడు. వాంగ్మూలంపై సంతకం చేస్తే ప్రాణాలు పోతాయంటూ కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. విచారణలో భాగంగా తొలిరోజు కొంత సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందం కిరణ్‌కుమార్‌రెడ్డిని మరో రెండు రోజులు ప్రశ్నించనుంది. ఆర్థిక లావాదేవీలు, కమీషన్లు, టెండర్లు తదితర లోగుట్టును బయటకు లాగేందుకు కసరత్తు చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి
రాష్ట్ర ఆర్థిక సంఘానికిపటిష్ఠ డేటా వ్యవస్థ