Share News

నియోజకవర్గానికో కోటి!

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:19 AM

నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఆర్థిక కష్టాలున్నా ప్రతి నియోజకవర్గానికీ కోటి రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారు.

నియోజకవర్గానికో కోటి!

  • ఎంపీలాడ్స్‌ ఫండ్‌నూ సద్వినియోగం చేసుకోవాలి

  • ఎమ్మెల్యేలు 25 ప్రాధాన్యాంశాలను గుర్తించాలి

  • వాటి పరిష్కారానికి పనిచేస్తే గుర్తింపు, గౌరవం

  • డబ్బులే ఎన్నికల్లో గెలిపించవు... జనంతో మమేకం కావాలి

  • లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో చంద్రబాబు పిలుపు

అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఆర్థిక కష్టాలున్నా ప్రతి నియోజకవర్గానికీ కోటి రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారు. సోమవారం టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో బొబ్బలి ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చిన్న సమస్యలనూ పరిష్కరించలేకపోతున్నామని, నిధులు అందుబాటులో ఉంటే బాగుంటుందని అన్నారు. సీఎం స్పందిస్తూ.. ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు ఎంపీ ల్యాడ్స్‌ నిధులనూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీలు కూడా వారి పరిధుల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాధాన్యాల వారీగా నిధులు కేటాయించాలన్నారు. ఎమ్మెల్యేలు కూడా లక్ష్యాలు పెట్టుకుని పనిచేయాలని.. ప్రతి నియోజకవర్గంలో 25 ప్రాధాన్యాంశాలను గుర్తించి, వాటి పరిష్కారానికి పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. ఒక్కరే పనిచేస్తే ఫలితం ఉండదని, శ్రేణులతో కలిసి సాగితే ప్రజాప్రతినిధుల బలం వందరెట్లు పెరుగుతుందన్నారు. అయితే డబ్బు ఒక్కటే ఎన్నికల్లో గెలిపించదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. కాంక్లేవ్‌ తరహా సమావేశాలు ప్రతి 3 నెలలకోసారి నిర్వహిస్తామని, ఈ మూడు నెలల కాలంలో ఏయే ఎమ్మెల్యేలు ఉత్తమ విధానాలు అమలు చేస్తారో.. వచ్చే సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చేలా వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యకర్తలు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ‘మహిళలకు కేటాయించిన సీట్లలో పోటీ చేసేందుకు సమర్థులను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా సమస్యలు పరిష్కరించాం. ప్రజల్లో సానుకూలత ఉంది. అది స్థానిక ఎన్నికల్లో ప్రతిఫలించాలి. 2029 ఎన్నికల్లో 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. అందుకే ప్రతిరోజూ పార్టీకీ కొంత సమయం కేటాయిస్తున్నాను’ అని అన్నారు.


రోజంతా మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగేవాడిని

తాను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి అవలంబించిన పద్ధతిని కాంక్లేవ్‌లో సీఎం వివరించారు. ఉదయం నుంచి పొద్దుపోయే వరకు మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగేవాడినని.. అపాయింట్‌మెంట్లు తీసుకుని గంటల తరబడి వేచిచూసే వాడినని చెప్పారు. ఉద్యోగులు, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుని.. స్వీయ ప్రేరణతో పరిష్కారమయ్యేవరకూ వదిలిపెట్టకుండా పనిచేసేవాడినని తెలిపారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ నాయకత్వాన్ని బలపరచుకుంటూ.. నాయకులను తీర్చిదిద్దుకుంటూ ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పారు.

యాంటీవేవ్‌లో గెలిచినవాళ్ల అనుభవాలే పాఠాలు..

యాంటీవేవ్‌లో గెలిచిన వాళ్ల అనుభవాలను, వారి పని విధానాన్ని నాయకులంతా గమనించాలని సీఎం సూచించారు. జనరేషన్‌ మార్పులను గమనించాలని, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పారు. ‘ప్రతి పదేళ్లకోసారి జనరేషన్‌ మారుతూ ఉంటుంది. ఈ తరానికి మనం మ్యాచ్‌ అయితే.. రాజకీయాల్లో సక్సెస్‌ సాధించగలం. మన నడవడికను ప్రజలు నిరంతరం గమనిస్తూనే ఉంటారన్న స్పృహ ప్రతి ఒక్కరిలో ఉండాలి. గద్దె రామ్మోహన్‌ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తూ వస్తున్నారు. అలాగే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వరదరాజులరెడ్డి సిన్సియర్‌గా పనిచేస్తారు. నిత్యం ప్రజల్లో ఉంటారు. గుడివాడ నియోజకవర్గంలో పరంధామయ్య అనే వ్యక్తి బూత్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు.. ఆయన పార్టీ వేదికగా ప్రజలకు సేవ చేస్తుంటారు. ఇలాంటివారు అనుసరిస్తున్న విధానాలు.. వారి అనుభవాలే మనకు పాఠాలు’ అని తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి

12న జాతీయ లోక్‌ అదాలత్‌

కుటుంబ సభ్యులే వేధిస్తున్నారు..

Updated Date - Sep 08 , 2026 | 04:19 AM