Share News

రాష్ట్ర ఆర్థిక సంఘానికిపటిష్ఠ డేటా వ్యవస్థ

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:49 AM

గ్రామ పంచాయతీలకు నిధుల పంపిణీ, ఆర్థిక వికేంద్రీకరణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే రాష్ట్రాల ఆర్థిక సంఘాల (ఎస్‌ఎఫ్‌సీ) వద్ద కచ్చితమైన సమగ్ర డేటా అందుబాటులో ఉండాలని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రాల ఆర్థిక సంఘాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డేటా కొరతేనని గుర్తించిన కేంద్రం.

రాష్ట్ర ఆర్థిక సంఘానికిపటిష్ఠ డేటా వ్యవస్థ

  • గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతానికి కేంద్రం కొత్త కార్యాచరణ

  • డేటా కొరతతో ఎస్‌ఎఫ్‌సీల పనితీరుపై ప్రభావం

  • సమగ్ర డేటాబేస్‌ ఏర్పాటుకు సిఫారసులు

  • ప్రతి రాష్ట్రంలోనూ ఎస్‌ఎఫ్‌సీ సెల్‌

  • గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఆర్థిక, సామాజిక సమాచారం అందుబాటులోకి

  • తద్వారా సమర్థవంతంగా నిధుల పంపిణీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు నిధుల పంపిణీ, ఆర్థిక వికేంద్రీకరణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే రాష్ట్రాల ఆర్థిక సంఘాల (ఎస్‌ఎఫ్‌సీ) వద్ద కచ్చితమైన సమగ్ర డేటా అందుబాటులో ఉండాలని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రాల ఆర్థిక సంఘాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డేటా కొరతేనని గుర్తించిన కేంద్రం.. ఈ లోటును అధిగమించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, రూపొందించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. గ్రామ పంచాయతీల ఆదాయం, వ్యయం, ఆస్తులు, సేవల అందుబాటు, సామాజిక-ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉంటేనే.. నిధుల పంపిణీ శాస్త్రీయంగా జరిగే అవకాశం ఉంటుందని కమిటీ పేర్కొంది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు డేటా సేకరణ, ప్రామాణీకరణ, డిజిటల్‌ నిర్వహణకు సంబంధించి నివేదికలో పలు కీలక సిఫారసులు చేసింది.

ఆర్థిక సంఘాల పనితీరులో లోపాలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243-1 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకోసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సంఘం గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి.. రాష్ట్ర పన్నుల వాటా, గ్రాంట్లు, ఇతర ఆర్థిక వనరుల పంపిణీపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. వీటి ఆధారంగానే స్థానిక సంస్థలకు ఆర్థిక బలం చేకూరుతుంది. ఆర్థిక సంఘాల పనితీరును పరిశీలించిన కమిటీ పలు తీవ్ర లోపాలను గుర్తించింది. పంచాయతీల ఆర్థిక లెక్కలను ఒకేవిధంగా నిర్వహించకపోవడం, శాఖల వారీగా డేటా సరిగా లేకపోవడం, గ్రామ పంచాయతీ స్థాయిలో సమాచారం అందుబాటులో లేకపోవడం, ఆదాయం, వ్యయం, ఆస్తులపై సమగ్ర డేటాబేస్‌ లేకపోవడం, శిక్షణ పొందిన అకౌంటెంట్లు, డేటా నిర్వహణ సిబ్బంది కొరత, పనితీరు ఆధారిత నిధుల పంపిణీకి అవసరమైన వివరాలు లేకపోవడం, రాష్ట్ర ఆర్థిక సంఘాల నివేదికలను ఆలస్యంగా సమర్పించడం, రాష్ట్రాల మధ్య నివేదికల్లో నాణ్యత, విధానంలో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు నివేదించింది.


ఏ సమాచారం సేకరించాలంటే!

కమిటీ నివేదిక ప్రకారం.. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం జనాభా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ జనాభా, సామాజిక వర్గాల వివరాలు, పేదరికం, అక్షరాస్యత, ఆరోగ్య పరిస్థితి, వెనుకబడిన ప్రాంతాల సమాచారం, పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం వివరాలు సేకరించాలి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, కేంద్ర నిధులు, అప్పులు, మూలధన వ్యయం, నిర్వహణ ఖర్చులు, పెండింగ్‌ బకాయిలు, గ్రామ ఆస్తులకు సంబంధించి పంచాయతీ భవనాలు, చెరువులు, రహదారులు, తాగునీటి వసతులు, వీధి దీపాలు, పారిశుధ్య సదుపాయాలు, శ్మశానాలు, ఇతర ప్రజా ఆస్తులు, సేవలకు సంబంధించి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, మౌలిక వసతులు, మహిళా సంఘాలు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, ఉపాధి హామీ పనులు, పంచాయతీ అభివృద్ధి సూచిక వివరాలూ తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఈ-గ్రామస్వరాజ్‌, పంచాయతీ అడ్వాన్స్‌మెంట్‌ ఇండెక్స్‌ (పీఏఐ2.0), జనాభా లెక్కలు, ఎస్‌ఈసీసీ, కాగ్‌ ఆడిట్‌ నివేదికలు, ఆడిట్‌ ఆన్‌లైన్‌, రాష్ట్ర బడ్జెట్‌ పత్రాలు తదితర వనరుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయని కమిటీ తెలిపింది. అయితే ఈ డేటా పంచాయతీ స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల విశ్లేషణ కష్టమవుతోందని నివేదిక పేర్కొంది.


కీలకమైన 15 ప్రధాన సిఫారసులు

కమిటీ 15 ప్రధాన సిఫారసులు చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆర్థిక సమాచారం సంవత్సరాల వారీగా భద్రపరిచేందుకు పంచాయతీ స్థాయిలో శాశ్వత ఆర్థిక డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫైనాన్స్‌ కమిషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ) సెల్‌ ఏర్పాటు చేసి, డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు నిధుల బదిలీని ఒకే అకౌంటింగ్‌ హెడ్‌ల కింద నమోదు చేసి, ఒకే అకౌంటింగ్‌ విధానం తీసుకురావాలి. రాష్ట్ర బడ్జెట్‌లో గ్రామ పంచాయతీ వారీగా ఎంత నిధులు ఇచ్చారో ప్రత్యేక పత్రంగా ప్రచురించాలి. ఈ-గ్రామ స్వరాజ్‌ సహా అందుబాటులో ఉన్న అన్నీ డేటా వనరుల వినియోగంపై ఆర్థిక సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. 73వ రాజ్యాంగ సవరణ అమలుపై కాగ్‌ ద్వారా ప్రత్యేక పనితీరు ఆడిట్‌ నిర్వహించాలి. రాష్ట్ర ఆర్థిక సంఘాలకు శిక్షణ, ఉత్తమ పద్ధతుల రూపకల్పన బాధ్యతలను జాతీయ స్థాయి సంస్థలు ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు అప్పగించాలని సూచించింది. గతంలో నిలిచిపోయిన పంచాయతీ గణాంకాల ప్రచురణను మళ్లీ ప్రారంభించాలని, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో అందుబాటులో ఉన్న అన్నీ డేటా వనరులను ఒకే హ్యాండ్‌బుక్‌లో తీసుకురావాలి. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు అనుసరించేలా సమగ్ర ఎస్‌ఎఫ్‌సీ మాన్యువల్‌ రూపొందించాలని కమిటీ ప్రతిపాదించింది.


సిఫారసులు అమలైతే ప్రయోజనం

ఈ సిఫారసులు అమలైతే పంచాయతీల ఆర్థిక స్థితిపై కచ్చిత సమాచారం అందుబాటులోకి వస్తుంది. నిధుల పంపిణీ పారదర్శకంగా మారుతుంది. రాష్ట్రాల మధ్య పోలికలు సులభమవుతాయి. పంచాయతీల పనితీరు ఆధారంగా నిధుల కేటాయింపునకు అవకాశం ఏర్పడుతుంది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను మరింత సమర్థంగా అంచనా వేయవచ్చని కమిటీ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఏర్పాటు కానున్న తదుపరి రాష్ట్ర ఆర్థిక సంఘానికి ఈ నివేదిక మార్గదర్శకంగా నిలిచే అవకాశముంది. ముఖ్యంగా ఈ-గ్రామస్వరాజ్‌, పంచాయతీ అడ్వాన్స్‌మెంట్‌ ఇండెక్స్‌ (పీఏఐ 2.0), పంచాయతీ వారీ ఆర్థిక డేటాబేస్‌, పంచాయతీ స్థాయి నిధుల ట్రాకింగ్‌, రాష్ట్ర బడ్జెట్‌లో గ్రామ పంచాయతీ వారీ నిధులు వెల్లడించడం వంటి అంశాలు అమల్లోకి వస్తే గ్రామీణ స్థానిక సంస్థలకు నిధుల పంపిణీ మరింత పారదర్శకంగా, శాస్త్రీయంగా మారే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి

12న జాతీయ లోక్‌ అదాలత్‌

17 నుంచి ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

Updated Date - Sep 08 , 2026 | 04:49 AM